చొప్పదండి, నవంబర్ 29: హింసను, ఉన్మాదాన్ని ప్రేరేపించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సుంకె మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. బండిసంజయ్ ఒక తొండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. మత విద్వేషాలు లేపి ఆగమాగం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని తెలంగాణలో విషపు కాలనాగు కుట్రలు సాగనివ్వబోమన్నారు. పోలీసుల అనుమతి లేకుండా యాత్ర ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కనీస విలువలు కూడా పాటించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నదని మండిపడ్డారు. భైంసాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఓ వర్గాన్ని టార్గెట్ చేయాలని సంజయ్ ప్లాన్ చేయడంతోనే ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ మేరకు అనుమతి రద్దు చేసి, అరెస్టు చేయడంతో దారిపొడవునా బీభత్సం సృష్టించాడని దుయ్యబట్టారు. రహదారిపై టైర్లకు నిప్పు పెట్టడం లాంటి పనులు చేస్తూ శాంతి యాత్ర అని పేరు పెట్టి దేశం కోసం, ధర్మం కోసం అని అనడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు.