కార్పొరేషన్, నవంబర్ 29: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై తిరుగుతున్న పందులను జనావాసాలకు దూరంగా తరలించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు పెంపకందారులకు సూచించారు. నగరంలోని రోడ్లపై పందులు ఉండడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, వెంటనే వాటిని తరలించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పెంపకందారులు తమ పందులను తరలించుకోవాలని సూచించారు. స్థానిక సప్తగిరికాలనీలోని వెహికల్ షెడ్డులో నగరంలోని పందుల పెంపకందారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గత సమావేశంలో రోడ్లపై పందులు లేకుండా చూడాలని సూచించామని, అయినా ఇంకా అలాగే ఉన్నట్లు తెలిపారు.
వీటిపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుందని, నగరంలోని రోడ్లపై తిరుగుతున్న పందులను పట్టుకునేందుకు జిల్లా అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. వారు మూడు రోజుల తర్వాత నగరంలో రోడ్లపై కనిపించిన పందులను పట్టుకుంటారని తెలిపారు. రోడ్లపైకి పందులను వదలవద్దని సూచించారు. శుక్రవారం నుంచి రోడ్లపై పందులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పందుల పెంపకందారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, తమకు మరింత సమయం ఇవ్వాలని పెంపకందారులు కోరగా, అది తన పరిధిలో లేదని, తప్పనిసరిగా మూడు రోజుల్లోనే పందులను రోడ్లపైకి రాకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్ కుర్ర తిరుపతి, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.