కార్పొరేషన్, నవంబర్ 29: నగరంలోని పాత పవర్ హౌస్ నుంచి నాకా చౌరస్తా, శివాలయం రోడ్డులో విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు కోరారు. నగరంలోని 6, 30వ డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఈ రోడ్డు ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ రోడ్డును అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ఎంతో దోహదపడుతుందన్నారు. నగరంలోని రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభమైతే కాపువాడ రోడ్డు కూడా బిజీగా మారుతుందన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నామని, రాబోయే రోజుల్లో హౌసింగ్‌బోర్డుకాలనీ రిజర్వాయర్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు 24 గంటల మంచినీటి సరఫరా అందిస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచి నీటి పైపులైన్ పనులకు ప్రాధాన్యత ఇచ్చి చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వరకు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్ నేతికుంట యాదయ్య, నాయకుడు కోల సంపత్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.