కలెక్టరేట్, నవంబర్ 28: ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం చేయకూడదని అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసాద్, ఎన్ ఖీమ్యానాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం వారు సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నా రు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కాగా మొత్తం 37ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసరావు, పవన్‌కుమార్, అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర శాఖగా ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమశాఖను స్వతంత్రశాఖగా ప్రకటించాలని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల శాఖను మహిళా, శిశు సంక్షేమశాఖలో విలీనం చేసిందని, డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తిరిగి ప్రత్యేక శాఖగా కేటాయించాలని వీజేఏసీ కన్వీనర్ కాసారపు పరశురాములు కోరారు. ఇక్కడ కే పరశురాములు, హరిప్రసాద్, రాము, రాజేశ్, వినయ్, మహేందర్, రాజు, రవి, మంజుల తదితరులు ఉన్నారు.