గన్నేరువరం, ఫిబ్రవరి 6: గన్నేరువరం, ఫిబ్రవరి 6 : అంకిత భావం గల ఉపాధ్యాయుల విద్యా బోధనతో గన్నేరువరం జడ్పీ ఉన్నత పాఠశాల ఏటా సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. పాఠశాలలో ప్రస్తుతం 6 నుంచి 10 తరగతుల్లో 320 మంది విద్యార్థులు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు. పాఠశాలలో 8 తరగతి గదులు, వంటశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలు ఉండగా, చుట్టూ ప్రహరీతో విశాలమైన మైదానం, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం సందర్శకులనూ ఆకట్టుకుంటున్నది.
ఇవీ పాఠశాల ప్రత్యేకతలు..
పాఠశాలలో విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభూతితో నేర్చుకునేలా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. కెయాన్ సహాయంతో(డిజిటల్) విద్యా బోధన చేస్తున్నారు. తెరపై చిత్రాలు చూస్తూ పాఠాలు వినడం ద్వారా విద్యార్థులు విషయాన్ని సులుభంగా అర్థం చేసుకోవడంతో పాటు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటున్నారు. చదువుతోపాటు విద్యార్థుల్లో క్రమ శిక్షణ, దేశ భక్తిని పెంపొందించేందుకు ఎన్సీసీ, మాతృ వందనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక స్పృహ, తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవభావాన్ని పెంపొందిస్తున్నారు. విశాలమైన మైదానం అందుబాటులో ఉండడంతో పీఈటీ సహకారంతో క్రీడా పోటీల్లోనూ మెరుస్తూ పతకాలు సాధించి సత్తా చాటుతున్నారు.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తుండడంతోనే ఏటా వంద శాతం రిజల్ట్ సాధిస్తున్నాం. పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నాం. ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాం. సేవా సంస్థల సహకారంతో పేద పిల్లలకు నోట్ బుక్స్ ఉచితంగా అందజేసి వారిని చదువులో ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో బోధనకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఇది ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదపడుతుంది.
– కట్టా రవీంద్రాచారి, హెచ్ఎం
పాఠాలు సులభంగా అర్థమవుతున్నయ్..
ఏటా మా స్కూళ్లో మంచి రిజల్ట్ రావడంలో మా టీచర్ల కృషి ఎంతో ఉంది. ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నరు. ఆన్లైన్లో పాఠాలు వినని వారికి తిరిగి క్లాస్ రూముల్లో స్పెషల్ క్లాసులు సైతం ఏర్పాటు చేస్తున్నరు. ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుండడంతో మా బడిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. అన్ని సౌకర్యాలు ఉన్న స్కూళ్లో చదువుకోవడం సంతోషంగా ఉంది.
– పీ ప్రహర్షిని, 9వ తరగతి విద్యార్థిని