పెద్దపల్లి, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): జిల్లాల పునర్విభజనకు ముందు పూర్వ కరీంనగర్లో పరిస్థితి దారుణంగా ఉండేది. కొన్ని మండలాల నుంచి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే వందకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. మంథని, మహాముత్తారం లాంటి మండలాల ప్రజలు కరీంనగర్లో ప్రజావాణికి రావాలంటే అరిగోస పడాల్సి వచ్చేది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చితే తప్ప వెళ్లలేని దుస్థితి ఉండేది. ఏ తెల్లవారుజామునో బయలుదేరితే అక్కడకు చేరుకునే సరికి పదకొండో పన్నెండో అయ్యేది. తీరా అధికారులను కలిసే అవకాశం రాకపోయేది. ఇక కలెక్టర్, ఉన్నతాధికారులు కలువాలంటే గగనమే అయ్యేది. చాలాసార్లు పోయినా పని కాకుండానే వెనుదిరగాల్సి వచ్చేది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏ గ్రామం నుంచైనా జిల్లా కేంద్రం నుంచి 40కిలోమీటర్ల దూరంలోపే ఉండడంతో పాలన చేరువైంది. ఉదయం జిల్లాకేంద్రానికి వెళ్లి, మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకునే అవకాశం వచ్చింది. పైగా జిల్లాకేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు ఏర్పాటు కావడం, శాఖలన్నీ ఒకేచోట ఉండడంతో జిల్లా అధికారులను నేరుగా కలిసే చాన్స్ దొరుకుతున్నది. ఈ క్రమంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి మరింత ఆదరణ పెరిగింది. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం దొరుకుతున్నది. ఈ క్రమంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి మరింత ఆదరణ పెరిగింది.
ప్రతి దరఖాస్తుపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి కొత్త జిల్లాగా ఏర్పడ్డ తర్వాత కూడా తాత్కాలిక భవనం ఐటీఐ ప్రాంగణంలో కలెక్టరేట్ సేవలను నిర్వహించారు. తర్వాత పెద్దకల్వల క్యాంపు రెండున్నర ఎకరాల స్థలంలో సకల హంగులతో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. గత ఆగస్టు 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి అధికారులంతా ఇక్కడే సేవలందిస్తున్నారు. జిల్లాలోని ఏ గ్రామం నుంచైనా ప్రజలు ఈజీగా చేరుకుంటున్నారు. తమ గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో నేరుగా జిల్లా అధికారులను కలిసి విన్నవించుకుంటున్నారు. ప్రతి సోమవారం పదుల సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తుండగా, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ ఓపికతో ప్రతి సమస్యలు వింటున్నారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే అక్కడికక్కడే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. క్లిష్టమైన సమస్య అయితే పరిష్కార మార్గాలు, ఆటంకాలను చర్చిస్తూ అర్జీదారుల్లో భరోసా నింపుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆయా మండల స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడి వచ్చిన దరఖాస్తు గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా సోమవారం ప్రజావాణికి మొత్తం 28 అర్జీలు రాగా, అందులో ఎనిమిది రెవెన్యూ శాఖకు, మిగితా 20 ఇతర శాఖలకు సంబంధించినవని అధికారులు వెల్లడించారు.
ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో నమోదు
ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తుదారుడి వివరాలు, సమస్యలను ఎన్ఐసీ (జాతీయ సమాచార కేంద్రం) కౌంటర్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత అర్జీ ఇచ్చిన వారికి స్టాంపు వేసి రిసీవ్ కాపీ ఇస్తూనే దానికి ఒక నంబర్‌ను కేటాయించి సంబంధిత శాఖలకు పంపుతున్నారు. సమస్య పరిష్కారమయ్యేలా చొరవ చూపుతున్నారు. ధరణి, భూ సమస్యలు, రెవెన్యూ, ఇతర గ్రామాలకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను జిల్లా అదనపు పాలనాధికారులు లక్ష్మీనారాయణ, కుమార్‌దీపక్‌కు సిఫారసు చేస్తున్నారు. వారి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్ సంగీత సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తున్నారు. కలెక్టర్ సంబంధిత విభాగ అధికారిని పిలిచి సమస్య ఎందుకు పరిష్కారం కాలేదో వివరణ అడిగి పరిష్కారమయ్యేలా పరిశీలించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని, మరోసారి వారిని తిరిగి రాకుండా చూడాలని కోరుతున్నారు.
ప్రతి ఒక్కరి సమస్యను వింటున్నాం..
ప్రజావాణికి విశేష స్పందన వస్తున్నది. చాలా మంది ప్రజలు తరలివస్తున్నారు. ప్రతి సమస్యను ఓపికతో విని పరిష్కారం చూపుతున్నాం. అత్యధికంగా భూ సంబంధిత సమస్యలు ఉంటున్నాయి. రెవెన్యూ అధికారులు, ధరణి ఆపరేటర్ అందుబాటులో ఉండడంతో అక్కడికక్కడే పరిశీలించి సమస్యకు సంబంధించిన అన్ని వివరాలను వారికే తెలియజేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు లోబడి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తున్నాం. వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరిస్తున్నాం. నాతోపాటు ఇద్దరు అదనపు కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉంటున్నాం. అందరు ఉన్నప్పుడు ఇక సమస్యలు ఎందుకు పరిష్కారం కావు. అవకాశం ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాం.
– డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి కలెక్టర్
దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నాం..
జిల్లాలో ప్రజలకు అనేక రకాల చిన్న చిన్న భూసమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అవి క్రమంగా తగ్గుతున్నా మరికొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటికి సంబంధించిన ప్రతి ఒక్క దరఖాస్తును కూలంకశంగా పరిశీలించి పరిష్కరిస్తున్నాం. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆయా శాఖలకు పంపి ఆ తర్వాత తిరిగి వాటి తీరుతెన్నుల గురించి ఆరా తీస్తున్నాం. ప్రజావాణితో సమస్యలన్నీ దాదాపుగా పరిష్కారమవుతున్నాయి.
– వడ్ల లక్ష్మీనారాయణ, పెద్దపల్లి అదనపు కలెక్టర్
ప్రతి సమస్యకూ పరిష్కారం..
ప్రజావాణిలో వచ్చే ప్రతి సమస్యకు దాదాపుగా పరిష్కారం దొరుకుతున్నది. అయితే కొన్ని న్యాయ సంబంధమైన సమస్యలను మాత్రం మేము ముట్టుకోవడం లేదు. అవి పూర్తిగా కోర్టుల ద్వారానే పరిష్కారమవుతాయి. గ్రామాల్లో కనీస సౌకర్యాలు, సమస్యలు వాటన్నింటిని ఆయా శాఖల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నాం.
– కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్
కలెక్టర్ అధికారిని పిలిచి మాట్లాడిన్రు
నేను ఎప్పుడూ ప్రజావాణికి రాలేదు. నా భూమి సమస్య కోసం ఇప్పుడే కలెక్టరేట్‌కు వచ్చిన. నా సమస్యను కలెక్టర్ పూర్తిగా విన్నారు. పరిష్కారం కోసం ఇంతకు ముందు మా మండలానికి తహసీల్దార్‌గా ఉన్న మేడంను పిలిచి మాట్లాడిన్రు. అక్కడి అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడిన్రు. నా సమస్య మేడం తప్పకుండా పరిష్కరిస్తుందనే నమ్మకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
– రొడ్డ లక్ష్మి, పెద్దరాత్పల్లి (కాల్వశ్రీరాంపూర్ మండలం)
నా భూమి సమస్య తీరుతది
నాకు పట్టా ఉన్నది. కానీ కొత్త పాస్ బుక్ వస్తలేదు. ఐదేండ్ల సంది మండలాఫీసు చుట్టూ తిరుగుతున్న. ఇప్పుడు కలెక్టరేట్ల సారు నా సమస్యను విన్నరు. పరిష్కరిస్తామని చెప్పిన్రు. కంప్యూటర్ల కూడా చూసిన్రు. అయితదని అన్నరు. సమస్య తీరుతదని నమ్మకం కలిగింది.
– రాజమ్మ, శాములపేట (జూలపల్లి మండలం)