జమ్మికుంట, నవంబర్ 19: ‘ఎంపీ అర్వింద్.. నోరు అదుపులో పెట్టుకో. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై మాట్లాడుతున్నవ్.. నీ ఇంట్లో మహిళలు లేరా..? మరోసారి ఇలా మాట్లాడితే సహించం’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి, మాట్లాడారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ‘కవిత నిన్ను చెప్పుతో కొడతానన్నారని కానీ అర్వింద్‌ను తాకాలంటే ఆ చెప్పు కుడా సిగ్గుపడుతుంది.’ అని ఎద్దేవా చేశారు. ‘బిడ్డా ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు.
నోరు అదుపులో పెట్టుకో. ఎమ్మెల్సీ కవిత గురించి, మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ గు రించి మాట్లాడితే నాలుక చీరేస్తా’ అని హెచ్చరించారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి కవితపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇది కేసీఆర్ పాలిస్తున్న రాష్ట్రం అని, మునుగోడు ఎన్నికల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చినా బుద్దిరాలేదా అని ప్రశ్నించారు. మత కల్లోలాలు లేపి రాష్ర్టాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇది ఉద్యమ గడ్డ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక్కడ డీసీసీబీ చైర్మన్ పింగిలి రమేశ్, ఎంపీపీ దొడ్డె మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.