వారంతా పల్లెటూరి పిల్లలు. ఆటల్లో మాత్రం చిచ్చర పిడుగులు. బాల్యం నుంచే చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ క్రీడాముత్యాలుగా వెలుగొందుతున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీలో, వ్యక్తిగత విభాగంలో అథ్లెటిక్స్, రెజ్లింగ్, జూడో, థైక్వాండో.. ఇలా మొత్తం 20 ఈవెంట్స్‌లో ఎల్లారెడ్డిపేట దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కురవిలో జరిగిన స్టేట్ మీట్లో జయకేతనం ఎగరేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 60 మంది బాలబాలికలు రాష్ట్రీయ, జాతీయస్థాయిలో పతకాల పండించి, ఆదర్శంగా నిలిచారు.
– ఎల్లారెడ్డిపేట, నవంబర్ 16
దుమాల ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పల్లెలు, తండాల్లోని పిల్లలే అభ్యసిస్తున్నారు. ఇక్కడ టెన్త్‌తోపాటు ఇంటర్ దాకా సీబీఎస్ఈ సెలబస్ బోధన జరుగుతున్నది. ఇందులో ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో నిరక్షరాస్యతకు, అమాయకత్వానికి సంకేతంగా ఉండే తండాల్లో, గూడెంలలో జన్మించిన వారే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. భాష తెలియక, యాస తెలియక పాఠశాల, కళాశాలల్లో అడుగుపెట్టిన అడవి బిడ్డలు ఉపాధ్యాయుల కృషితో క్రీడల్లో రాణిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీలో, వ్యక్తిగత విభాగంలో అథ్లెటిక్స్, రెజ్లింగ్, జూడో, థైక్వాండో.. ఇలా 20 రకాల ఈవెంట్స్‌లో రాణిస్తున్నారు.
60 మంది సత్తా..
మహబూబాబాద్ జిల్లా కురవిలో ఈ నెల 1 నుంచి 5వ తేదీ దాకా స్టేట్‌మీట్ జరిగింది. ఇందులో దుమాల ఈఎంఆర్‌ఎస్‌లో చదువుతున్న 443 మంది విద్యార్థుల్లో 54 మంది బాలికలు, ఆరుగురు అబ్బాయిలు మొత్తంగా 60 మంది విద్యార్థులు పాల్గొని జయకేతనం ఎగరేశారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. అండర్-19, అండర్-17, అండర్-14లోని సామూహిక విభాగంలోని కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీలో, వ్యక్తి విభాగంలో అథ్లెటిక్స్, రెజ్లింగ్, జూడో, థైక్వాండో, బాక్సింగ్, స్విమ్మింగ్, చెస్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, యోగా, బ్యాడ్మింటన్, జిమ్మాస్టిక్స్ మొత్తం 20 ఈవెంట్స్‌లో రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటారు.
ప్రతి విభాగంలో పతకాల పంట
కురవి ఈఎంఆర్‌ఎస్‌లో రాష్ట్రస్థాయిలో 23 పాఠశాల, కళాశాలలు ఉండగా అందులోని 1500 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో దుమాల గురుకులానికి చెందిన విద్యార్థినులు ఎన్నుకున్న ప్రతి విభాగంలోనూ ప్రత్యేకత చాటారు. అథ్లెటిక్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, ఒక బ్రోంజ్, బ్యాడ్మింటన్‌లో రెండు గోల్డ్ మెడల్స్, చెస్‌లో ఒక గోల్డ్‌మెడల్ అండర్-19 చాంపియన్‌షిప్ సాధించారు. బాక్సింగ్‌లో ఒక గోల్డ్‌మెడల్, జిమ్నాస్టిక్స్‌లో 11గోల్డ్‌మెడల్స్, 2 సిల్వర్‌మెడల్స్, 3బ్రోంజ్ మెడల్స్, జూడోలో 3గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 1 బ్రోంజ్ మెడల్ అందుకున్నారు. థైక్వాండోలో ఒక గోల్డ్‌మెడల్, ఒక బ్రోంజ్, రెజ్లింగ్‌లో 8గోల్డ్, 5 సిల్వర్, 2బ్రోంజ్ మెడల్స్ సాధించారు. యోగాలో 16 గోల్డ్, 9 సిల్వర్ 11 బోంజ్ మెడల్స్ అందుకున్నారు. హ్యాండ్‌బాల్‌లో బాలికల విభాగం ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ అండర్-19 విభాగంలో రన్నరప్‌గా నిలవడంతో పాటు అండర్-19 బాలికల రన్నరప్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు.
మంచి ఫలితాలు సాధిస్తున్నారు..
చదువుల్లో, ఆటల్లో మా ఈఎంఆర్ఎస్ విద్యార్థులు మంచి ప్రతిభను చూపుతున్నారు. పాఠశాల, కళాశాలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఆయా రంగాల్లో ట్రైనింగ్ ఇస్తూ నిష్ణాతులుగా తయారు చేస్తున్నాం. అందువల్లే కురవిలో జరిగిన పోటీల్లో సత్తాచాటారు. తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తే ఉత్తమ ఫలితాలు తీసుకువస్తాం. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతాం.
– జ్యోతిలక్ష్మి, ప్రిన్సిపాల్, ఈఎంఆర్ఎస్, దుమాల
గోల్డ్‌మెడల్ సాధించాను…
కురవిలో జరిగిన స్టేట్‌మీట్‌లో నేను హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో ఆడా. హ్యాండ్‌బాల్‌లో గోల్డ్‌మెడల్, బాస్కెట్‌బాల్‌లో సిల్వర్, థైక్వాండోలో బ్రోంజ్ గెలుచుకున్నా. మా పీడీలిద్దరూ ఇస్తున్న ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తున్నది. ఆటలు ఆడాలనుకునే ప్రతి విద్యార్థి ఏ ఆటలో నైపుణ్యం ప్రదర్శిస్తాడో చూసి అందులో మంచిగా ట్రెయినింగ్ ఇస్తున్నారు. చదువులో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్నాం.
-బాదావత్ అశ్విని, ఈఎంఆర్ఎస్ పాఠశాల, దుమాల