గోదావరిఖని, నవంబర్ 10 : ‘బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర ఏండ్ల కాలంలో చేసిందేమీ లేదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. సింగరేణి పరిధిలో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించకుండా ఆర్ఎఫ్సీఎల్కు రావడంలో అర్థం లేదు. మీరు జవాబుదారీతనం వహించాలి. ఈ ప్రాంత ప్రజానికానికి మీ అభిప్రాయం తెలుపాలి.
ఆ తర్వాతే ఆర్ఎఫ్సీఎల్ జాతికి అంకితం చేయడం ప్రధానిగా మీ బాధ్యత అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.’ అంటూ ఈ నెల 12న రామగుండానికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా రాష్ట్ర పౌరహక్కుల సంఘం పలు అంశాలతో బహిరంగలేఖను గురువారం విడుదల చేసింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కార్మిక, ప్రజా, విప్లవ సంఘాలు అన్ని మూకుమ్మడిగా ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినదిస్తున్నాయని, ఈ నిరసనను పౌరహక్కుల సంఘం పూర్తిగా సమర్థిస్తున్నదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ వైఫల్యాలను తెలియజేయాల్సి వస్తున్నదని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, నాయకులు శ్రీపతి రాజగోపాల్, పుల్ల సుచరిత, నార వినోద్, బొడ్డుపల్లి రవి, గడ్డం సంజీవ్‌కుమార్, పోగుల రాజేశం ప్రకటనలో పేర్కొన్నారు.
2014, 2019లో రెండు సార్లు గెలిచిన బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నదని, నోట్ల రద్దు, ప్రైవేట్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బొగ్గు గనులను కమర్షియల్ రంగంలోకి తీసుకువస్తూ ప్రైవేటీకరణవైపు దారులు తెరిచిందని గుర్తు చేశారు. అనేక రంగాల్లో ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న బీజేపీ 44 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లుగా మార్చివేయడం, సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మివేసే ప్రయత్నం చేయడం, బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఆలస్యం చేయడం, డీపీఐ నిబంధనలు పెట్టి వేతనాలు పెరగుకుండా చేసిందని మండిపడ్డారు.
2015లో ఆర్ఎఫ్సీఎల్ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా నిర్వాసిత గ్రామాల్లో నిరుద్యోగులైన వారికి ఉద్యోగాలు కల్పించే ఆంశంపై ఇచ్చిన హామీని ఎందుకు మరచిపోయారని మోదీని ప్రశ్నించారు. ఎఫ్‌సీఐ మూసివేసే నాటికి పనిచేస్తోన్న 1400 మంది కాంట్రాక్టు కార్మికులకు తిరిగి అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వీటన్నింటిపై మౌనంగా ఉండి ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి ప్రారంభమైన ఆర్ఎఫ్సీఎల్ను తిరిగి జాతికి అంకితం పేరుతో ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ నిరసనను, వ్యతిరేకతను ప్రదర్శించుకునే అవకాశం ఉందని, దీనిని కాదని పోలీసులు అతిగా ప్రవర్తించవద్దని సూచించారు. పలు డిమాండ్లపై సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.
డిమాండ్లివే
ప్రైవేట్‌కు ఇచ్చిన సింగరేణి నాలుగు బొగ్గు బ్లాక్‌లను రద్దు చేసి సింగరేణికే ఇవ్వాలి.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అమ్మడాన్ని విరమించుకోవాలి.
44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
విద్యుత్ సవరణ చట్టాలను రద్దుచేయాలి.
ఆంక్షలు ఎత్తివేసి తక్షణమే వేజ్ బోర్డును అమలు చేయాలి.
సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
రామగుండం పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగులందరికీ యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి.