వీణవంక, అక్టోబర్ 30 : చల్లూరు గ్రామానికి చెందిన నీలం మానస-సతీశ్, పస్తం ముత్తమ్మ-రాములు దంపతులవి నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి
వారిది. ఇందులో పస్తం ముత్తమ్మ-రాములు కుటుంబం పరిస్థితి చాలా దీనంగా ఉండేది. ఇక నీలం మానస-సతీశ్ విషయానికి వస్తే బతుకుదెరువు పక్కనపెడితే అక్కాచెల్లెళ్ల
పెండ్లిళ్లకు జేసిన అప్పులు రూ.5 లక్షలు భారం ఉంది. ఇరుకుటుంబాలు పొట్టచేతపట్టుకొని తొమ్మిదేండ్ల కింద మహారాష్ట్రకు వెళ్లారు. సిరివంచలో ప్లాస్టిక్ టబ్బులు, కుర్చీలు,
డ్రమ్ములు, బోళ్లు అమ్ముతూ జీవనాన్ని సాగించారు. అక్కడి నుంచి చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ర్టాల్లో తిరుగుతూ వ్యాపారం చేశారు. రోజుల తరబడి సరిగ్గా తిండిదొరక్క, ఉండేందుకు
నీడ లేక రోడ్ల మీడ పడుకొని రోజులు ఎళ్లదీసుకున్నరు. అక్కడి వాళ్ల భాష వీరికి రాకపోవడంతో ఎంతోమంది ఎగతాళి చేసినా, కొందరు కొట్టినా భరించి బతికారు. కానీ, సీఎం
కేసీఆర్ దళితబంధు పథకం వీరికి బతుకుచూపింది. తొమ్మిదేండ్ల కష్టాలను దూరం చేసింది. మహారాష్ట్రలో ఉండగానే కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెడుతున్నాడని తెలిసి
తిరిగొచ్చారు. ఎక్కడైతే బతుకుదెరువు కోసం కష్టాలు పడ్డారో అక్కడికే ఇంజినీరింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకొని దర్జాగా బతుకుతున్నారు.
నెలకు రూ.60 వేల ఆదాయం
బతుకుదెరువు కోసం రాజ్యాలు పట్టుకొని తిరిగిన వాళ్లు ఈ రోజు పెద్ద షాపునకు యజమానులయ్యారు. నీలం మానస-సతీశ్, పస్తం ముత్తమ్మ-రాములు రెండు కుటుంబాలు
దగ్గరి బంధువులు. ఇద్దరు కలిసి రూ.20 లక్షలతో వారికి ఆసక్తి, అనుభవం ఉన్న ఐరన్ బెడ్స్, ఫర్నీచర్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ యూనిట్‌ను ‘శ్రీరామ’ పేరిట ఏర్పాటు
చేసుకున్నారు. ముడిసరుకును పంజాబ్ నుంచి హైదరాబాద్ డీలర్ ద్వారా నేరుగా తమ దుకాణానికి తెప్పించుకుంటున్నారు. ప్రతి నెలా సుమారు రూ.10 లక్షల విలువైన
ముడిసరుకు దిగుమతి అవుతున్నది. ఈ షాప్‌లో లెగ్ ఫోల్డింగ్, సెంటర్ ఫోల్డింగ్ విత్ ఫోమ్ ఐరన్ బెడ్స్, స్టడీచైర్స్, డైనింగ్ టేబుల్స్, ఐరన్ టేబుల్స్, వీటితో పాటు ట్రాలీలు,
ఆటోలు, ట్రాక్టర్లకు బాడీ ఫ్రేమ్, ఐరన్ గేట్స్, ట్రాక్టర్ కేజ్‌వీల్స్ తయారు చేస్తారు. ప్రతి నెలా సుమారు 500 నుంచి 800 ఐరన్ బెడ్స్, 200 స్టడీచైర్స్, 100 డైనింగ్ టేబుల్స్
తయారు చేస్తారు. బీహార్ రాష్ర్టానికి చెందిన 10 మంది ఈ షాప్‌లో ఉపాధి పొందుతుండగా, వీటిని విక్రయిస్తూ మరో 30 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. తెలంగాణ
రాష్ట్రంలోని భద్రాచలం, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, ధర్మపురి ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో వీరు తయారు చేసిన ఐరన్బెడ్స్,
తదితర వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెలా అన్ని ఖర్చులు పోను రూ.60 వేలు సంపాదిస్తూ మానస, ముత్తమ్మలు ఆర్థికంగా ఎదుగుతూ అందరికీ ఆదర్శంగా
నిలుస్తున్నారు.
బతుకు మారుతదని అనుకోలె..
బతుకుదెరువు కోసం రాజ్యాలు పట్టుకొని తిరిగిన మాకు దళితబంధు దారిచూపింది. యజమానులను చేసింది. ఎట్లాంటి బతుకు గడిపినమో ఆ దేవునికే తెలుసు. పది
రూపాయలు వెనుకెయ్యడానికి ఎన్నో కష్టాలు పడ్డం. ఆడ మనిషినని గూడ సూడకుంట ఎన్నో మాటలు అనేటోళ్లు. నిద్రపోయేందుకు జాగలేక రాత్రికి, పగటికి తేడా
తెలువకపోయేది. అన్నం దొరక్క ఎన్నో రోజులు కడుపుమాడుసుకున్నం. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతయోనని ఏడ్వని రోజులేదు. సీఎం కేసీఆర్ సారు మా పాలిట దేవుడు.
మాలాంటోళ్లకు బతుకుదెరువు జూపెట్టడానికి దళితబంధు తీసుకచ్చిండు. కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకున్నడు. ఇంతకు ముందు వలస కూలీలం.. ఇప్పుడు
ఐరన్ బెడ్ షాప్‌కు యజమానులం. గింత మార్పు అస్తదని కలలో గూడా అనుకోలె. రోజులేచి కేసీఆర్ సారుకు దండం పెడుతున్నం. దేశంల గిట్లాంటి సీఎం, గిట్లాంటి పథకం
ఎక్కడగూడా లేదు. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– నీలం మానస, దళితబంధు లబ్ధిదారురాలు
కన్నవాళ్లే పొమ్మంటే.. కేసీఆర్ రమ్మన్నడు..
చెయ్యని అప్పులు నెత్తిన ఎత్తి కన్న తల్లిదండ్రులే బయటికి పొమ్మన్నరు. ఏ దిక్కులేని మాకు సీఎం కేసీఆర్ కనికరించి పెద్ద దిక్కైండు. అప్పులు కట్టేందుకు నా భార్యను
పట్టుకొని రాజ్యాలు తిరిగిన. దిక్కులేని బతుకు ఎల్లదీసిన. రోడ్ల మీద నిద్రపోయెటోళ్లం. ఎంతో మంది అయినవాళ్లు ఉన్నా బతుకుదెరువు లేక వనవాసం చేసిన. కేసీఆర్ సార్
మా మీద దయతలిచిండు. మా కోసం దళితబంధు తీసుకచ్చి రూ.10 లక్షలు ఇచ్చిండు. ఉన్న ఊళ్లెనే వ్యాపారం మొదలు పెట్టినం. మేం బతికేదిగాకుంట పది మందికి పని
కల్పిస్తన్నం. కూలీ బతుకు పోయి యజమానులం అయినం. వలస కూలీ బతుకులను రాజులుగా చేసింది సీఎం కేసీఆర్. ఆయనలాంటోళ్లు దేశానికి కావాలె. అప్పుడే
మాలాంటోళ్ల బతుకులు మారుతయి.
– నీలం సంపత్, దళితబంధు లబ్ధిదారుడు
ఆర్థికంగా ఎదుగుతున్నరు
దళితబంధు పథకం ఎన్నో సత్ఫలితాలనిస్తున్నది. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో తోడ్పడుతుంది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్‌ను పూర్తి స్థాయిలో
సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కూలీలుగా ఉన్న వారు ఇప్పుడు
యజమానులుగా మారారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలి.
– శ్రీలత, డీఆర్డీవో