పెద్దపల్లి, అక్టోబర్ 30: పెద్దపల్లి నుంచి ఢిల్లీకి రైల్ టికెట్ స్లీపర్ క్లాస్ రూ. 800, జనరల్‌కు రూ. 420 దాకా చార్జీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఢిల్లీకి ట్రైన్ ద్వారా దాదాపు 22 గంటల్లో చేరుకోవచ్చు. అలాగే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అదే రోడ్డు మార్గాన వాహనం (బస్సు, కారు) ద్వారా వెళ్తే రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. చార్జీలు రైలు టికెట్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ. ఈ ఒక్క ఉదాహరణ చాలు రైలుతో ఎంత ఉపయోగం ఉంటుందో.
హాల్టింగ్ ఎత్తివేశారు..
పెద్దపల్లి రైల్వే స్టేషన్ 1929లో ఏర్పాటైంది. పెద్దపల్లి జంక్షన్‌గా (2001) అప్‌గ్రేడ్ అయింది. ఉత్తర – దక్షిణ భారత దేశాన్ని కలిపే గ్రాండ్ ట్రాక్ లైన్ పెద్దపల్లి రైల్వేస్టేషన్ గుండా వెళ్తుంది. కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీర్ దాకా, రాష్ట్ర రాజధాని నుంచి దేశ రా జధాని దాకా ఉండే ప్రధాన రైలు మార్గంలో పెద్దపల్లి రైల్వేజంక్షన్ ఉంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ను జంక్షన్‌గా మార్చినా ఆ స్థాయిలో ఉండాల్సిన కనీస వసతులు కరువయ్యాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా, లాక్డౌన్ కాలంలో రైళ్ల రాకపోకలు ని లిచి పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు. కరోనా వైరస్ రాక ముందు పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఆగిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ఆగడం లేదు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని డిమాండ్ చేస్తుంటే.. ఆగే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్ ఎత్తివేశారు.
వ్యయ ప్రయాసలకోర్చి..
రైల్వే ప్రయాణం ఖర్చు తక్కువ.. సౌకర్యం ఎక్కువ. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సాధారణంగా రైళ్లలోనే వెళ్లేందుకు ఇష్టపడుతారు. కానీ పెద్దపల్లి రైల్వేజంక్షన్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో విధి లేని వ్యయ ప్రయాసలకోర్చి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో పాటు ఇక్కడికి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల రాకపోకలు ఎక్కువయ్యాయి. పలు రాష్ర్టాల ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు.
రైలు మార్గం ఉన్నా…
పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, కేరళ, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఇతర రాష్ర్టాలకు వెళ్లేందుకు రైలు మార్గం ఉన్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడంలేదు. పెద్దపల్లి నుంచి అనేక మంది వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజలు తమ అవసరాల కోసం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వెళ్లి, వస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా నష్టం పోవడమే కాకుండా సమయం వృథా అవుతుందని పలువురు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. పెద్దపల్లి జంక్షన్లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపితే, పెద్దపల్లి జిల్లా ప్రజలతో పాటు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది.
విన్నపాలు వినవలె…
అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని కేంద్ర పభుత్వం, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు, తీసుకెళ్లారు. మైసూర్ -జైనూర్, నవజీవన్, హెచ్ఎస్ఆర్, దక్షిణ్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లు ఆపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే ఉన్నతాధికారులకు ఐదారేండ్ల నుంచి చాలా సార్లు వినతి పత్రాలు అందించారు. కేంద్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ప్రయాణికులకు ఆర్థిక ఇబ్బం దులు తప్పడంలేదు. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలి..
పెద్దపల్లి రైల్వే జంక్షన్లో మైసూర్, జైనూర్, నవజీవన్, హెచ్ఎస్ఆర్, దక్షిణ్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లు ఆపాలని సికింద్రాబాద్ డీఆర్ఎంకు అనేక సార్లు విన్నవించాం. పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో ప్రయాణికులు రద్దీ పెరుగుతున్నది. పెద్దపల్లిలో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపితే పూర్వ కరీంనగర్ జిల్లా వ్యాపారులు తమ వ్యాపారం నిమిత్తం ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, సూరత్, ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
-శర్వాన్, వ్యాపారి,డీఆర్‌యూసీసీ మెంబర్