గంగాధర/ కలెక్టరేట్/ చొప్పదండి, అక్టోబర్ 26 : చేనేతపై వేసిన 5 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని చేపడుతున్న పోస్టు కార్డు ఉద్యమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉధృతమవుతున్నది. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో నేత కార్మికులు ప్రతి ఒక్కరూ ప్రధానికి లేఖలు రాసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గంగాధర మండలంలోని గర్శకుర్తిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్వయంగా లేఖ రాసి, ప్రధాని మోదీకి పోస్టు చేశారు. ఇక్కడ ఆయనతో పాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు.
చేనేతపై జీఎస్టీని రద్దు చేసి, కార్మికుల సమస్యలు పరిషరించాలని కరీంనగర్లో తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ ప్రధానికి లేఖ రాశారు. చొప్పదండి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య స్థానిక భక్తమార్కండేయ దేవాలయంలో పద్మశాలీ కులస్తులతో కలిసి ప్రధానికి లేఖలు రాశారు. చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన నివాసంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చేనేత వృత్తిని ఒక కళగా గుర్తించాలే తప్ప వ్యాపార కోణంలో చూడవద్దని జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో కోరారు.
ధర్మారం మండలం బొట్లవనపర్తిలో పద్మశాలీ సంఘం మండల కన్వీనర్ కూరపాటి శ్రీనివాస్ అధ్వర్యంలో నేత కార్మికులు ప్రధానికి లేఖలు రాసి పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో నేత కార్మికులు ప్రధానికి ఉత్తరాలు రాశారు. మెట్పల్లి పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలీ సంఘం సభ్యులతో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రధానికి లేఖలు రాశారు.
చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రధానికి రాసిన పోస్టు కార్డులో పేర్కొన్నారు. చేనేతపై జీఎస్టీ ఎత్తేసే వరకు ఉద్యమిస్తామని పెగడపల్లి మండలం బతికపల్లిలో పద్మశాలీ సంఘం నాయకులు ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని పద్మశాలీ సేవా సంఘం నాయకులు, టీ(బీ)ఆర్ఎస్ నాయకులు, మల్లాపూర్ మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం నాయకులు చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని మోదీకి ఉత్తరాలు రాశారు. ధర్మపురి మండలం జైన గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో పద్మశాలీలు పోస్టుకార్డులు రాస్తూ నిరసన తెలిపారు.
వెంటనే రద్దు చేయాలి
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు బీమా, సబ్సిడీ, ఆసరా పెన్షన్, ఏటా కోటి 10 లక్షల బతుకమ్మ చీరలతో ఉపాధి కల్పిస్తూ ఆదుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో కార్మికులకు అన్యాయం చేస్తున్నది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి.
– పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
చేనేత వృత్తిని కళగా గుర్తించాలి
చేనేత వృత్తిని ఒక కళగా గుర్తించాలే తప్ప వ్యాపార కోణంలో చూడవద్దు. చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన పన్నును వెంటనే రద్దు చేయాలి. ఆర్థిక సంక్షోభంలో మూలన పడ్డ మగ్గాలకు జీవం పోయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. కానీ, కేంద్రం నేతన్నల జీవితాలను అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నది. స్వాతంత్య్ర పోరాట ఉద్యమంలో చేనేత ప్రధాన భూమికి పోషించిన విషయాన్ని ప్రధాని మోదీ మరిచి పోవద్దు.
– బొద్దుల లక్ష్మణ్, జూలపల్లి జడ్పీటీసీ