కోల్‌సిటీ, జనవరి 29 : తెలంగాణ సర్కారు బడులను బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇప్పటికే ప్రైవేట్‌కు దీటుగా విద్యనందిస్తూ గోదావరిఖనిలోని గాంధీనగర్‌లో గల గాంధీ పార్కు పాఠశాల విద్యనందిస్తున్నది. యేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం ఈ స్కూల్లోని ఐదు తరగతుల్లో 554 మంది విద్యార్థుల సంఖ్యతో ఉత్తమ పాఠశాలల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఐదుగురు ఉపాధ్యాయులు తమ పిల్లలకు మెరుగైన బోధన అందిస్తుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమష్టి కృషితోనే ప్రగతి..
గాంధీ పార్కు పాఠశాలలో 2013లో కేవలం వంద మంది విద్యార్థులు ఉండేవారు. హెచ్ఎంగా స్వరూప్‌చంద్ బాధ్యతలు తీసుకున్నాక ఆ బడి రూపురేఖలు మారిపోయాయి. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనను ప్రారంభించారు. అడ్మిషన్ల పెంపే లక్ష్యంగా ఇంటింటా విస్త్రత ప్రచారం చేశారు. ఇక్కడి వసతులు, బోధనాతీరుపై తల్లిదండ్రులకు విడమరిచి చెప్పారు. ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, స్వచ్ఛమైన తాగునీరు ఇతరత్రా వసతులపై అవగాహన కల్పించారు. సృజనాత్మకత పెంపొందించే లక్ష్యంతో స్కూల్ గోడలపై రంగురంగుల సామాజిక చిత్రాలను వేయించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మౌలిక సదుపాయాలు కల్పించారు.
ఏటేటా పెరుగుతున్న ఆడ్మిషన్లు
గాంధీ పార్కు పాఠశాలలో 2015లో 325 మంది విద్యార్థులు ఉండగా, 2016లో 443 మంది, 2017లో 457, 2018లో 430 మంది విద్యార్థులు చేరారు. 2019లో 326 మంది, 2020లో 333 మంది ఉండగా ఈ విద్యా సంవత్సరం 2021లో 554 మంది విద్యార్థులతో ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాఠశాల నుంచి ఇప్పటివరకు సుమారు 50 మంది విద్యార్థులు మోడల్ పాఠశాలలో సీటు సాధించారు.
త్వరలో నూతన భవనంలోకి..
ఇక్కడి స్కూల్ ప్రాంగనంలో అదనపు తరగతి గదుల కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ.60లక్షలు వెచ్చించి సకల హంగులో నూతన భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. పాఠశాలలో ఇప్పుడున్న గదులకు తోడుగా నిర్మించిన నూతన భవనంతో స్కూల్ గ్రేడ్ పెరిగే అవకాశముంది. ఇంకా మన ఊరు.. మన బడితో కొత్త హంగులు సంతరించుకోనుంది.
ప్రైవేటుకు దీటుగా..
గాంధీ పార్కు పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యనందిస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు బడుల్లో చదివించే స్థోమత ఉన్న వారు సైతం తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పించేందుకు ముందుకువస్తున్నారు. ఏటేటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం. ఫలితాల సాధనలోనూ ముందుండడంతో మున్ముందు పిల్లల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం. ప్రభుత్వ స్కూళ్లపై సమాజంలో ఉన్న ఆలోచన ధోరణి మారాలి. వేలకు వేలు ఫీజులు కట్టిన చోటే మంచి విద్యా బోధన అందుతుందని అనుకోవడం అపోహే. తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. మన ఊరు.. మన బడితో ప్రభుత్వ పాఠశాలలు కొత్తగా మారుతాయి. ఆంగ్ల బోధనతో అడ్మిషన్లు కూడా భారీగా పెరుగుతాయి.
మా పిల్లలుగా చూసుకుంటాం..
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన విద్యనందిస్తున్నాం. మా పాఠశాల పిల్లలను మా సొంత వారిలా చూసుకుంటాం. ప్రతి విద్యార్థి పట్ల కేర్‌గా ఉంటాం. పిల్లలు చదువులో రాణించాలంటే విద్యా బోధన ఒక్కటే చాలదు. పాఠశాల వాతావరణం కూడా బాగుండాలి. సౌకర్యాలుండాలి. అవన్నీ మేము సమకూర్చుకున్నాం. పాఠశాలకు పీఈటీ టీచర్‌ను నియమిస్తే బాగుంటుంది.