తపాలా శాఖ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.399 కే రూ.10 లక్షల యాక్సిడెంటల్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూపు, టాటా ఏఐజీతో కలిసి ఈ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని నిర్ణయించింది. అతిచౌకగా బీమాతో ధీమానిస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– కోల్సిటీ, అక్టోబర్ 18
కరోనా నేపథ్యంలో ప్రజలు ఇన్సూరెన్స్ పాలసీలపై దృష్టి పెట్టారు. కొత్త కొత్త బీమా పాలసీలను ఎంచుకుంటున్నారు. అందుకు అనుగుణంగా తపాలా శాఖ ప్రజలకు ఎన్నో బహుళ ప్రయోజనాలను కల్పిస్తున్నది. పోస్టాఫీసుల్లో పొదుపు చేసుకునే డబ్బుకు మరింత భద్రత కల్పించడమే కాకుండా రెట్టింపు లాభాలను మోసుకొస్తున్నది. ప్రమాద బీమా, సుకన్య సమృద్ధి యోజన, పీఎంజేజేబీవై, ఏపీవై, సేవింగ్స్ బ్యాంకు ఖాతా, తదితర రంగాలతోపాటు తాజాగా తీసుకవచ్చిన ప్రమాద బీమా పాలసీతో మరింత చేరువవుతున్నది. ఇంతకీ ఆ బీమా ప్రత్యేకత రూ.399కే రూ.10 లక్షల ప్రమాద బీమా. ఈ బీమా తీసుకొచ్చిన కొద్ది రోజుల్లోనే విశేష ఆదరణ చూరగొంటున్నది.
18-65 ఏండ్ల వయసు వారే అర్హులు
ఈ ప్రమాద బీమాకు 18-65 ఏండ్ల మధ్య వయసు వారు అర్హులు. ఇప్పటి పరిస్థితిలో అందరికీ ప్రమాద బీమా అత్యవసరమే. వినియోగదారుల సేవల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఏఐజీ ద్వారా తపాలా శాఖ ప్రమాద బీమాకు గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ పేరిట కొత్త పథకం అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో చేరాలనుకునే వారు సమీప పోస్టాఫీసుల్లో సంప్రదించాలి. రూ.100 చెల్లించి ఖాతా తెరచి సంవత్సరం ప్రీమియంతో ప్రారంభించవచ్చు. బీమా పాలసీలో ఖర్చుల కోసం రూ 60వేలు, ప్రమాదవశాత్తు గాయాలపాలైతే రూ.30వేలు. మరోవైపు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం అందజేయనున్నారు. ఆధారపడిన ఇద్దరు పిల్లల చదువులకు రూ.లక్ష అందిస్తుంది. దీంతోపాటు రవాణా ఖర్చు కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రయోజనాలెన్నో..
సంవత్సరానికి రూ.399 ప్రీమియంతో రూ.10 లక్షల బీమా పొందవచ్చు. పాలసీదారు మరణించినా, ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందినా రూ.10 లక్షలు వరకు లబ్ధి చేకూరుతుంది. అంతేగాక వైద్య ఖర్చులకు రూ.60 వేల లోపు, విద్యా ప్రయోజనాలు 10 శాతం లేదా రూ.లక్ష, దవాఖానలో రోజువారీ నగదు 10 రోజుల వరకు రోజుకు రూ.వెయ్యి, కుటుంబ రవాణా కోసం రూ.25 వేలు లేదంటే ఏది తక్కువైతే అది.
లాభదాయకమైన స్కీంలు
తపాలాశాఖ ఎన్నో లాభాదాయక పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా కొత్తగా తెచ్చిన ప్రమాద బీమా ప్రజలకు కొండంత భరోసాగా ఉంటుంది. ప్రీమియం దారు సంవత్సరానికి రూ.399 చెల్లిస్తే, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే నామినీకి రూ.10 లక్షల వరకు చెల్లించే ఏకైక అత్యుత్తమ పాలసీ ఇదొక్కటే. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– యూ సతీశ్, సబ్ పోస్ట్మాస్టర్ (గోదావరిఖని)