కార్పొరేషన్, జనవరి 29: ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు గొప్పవరమని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ రూ. లక్షా నూటపదహార్లు అందజేస్తూ అండగా ఉంటున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నదని పేర్కొన్నారు. కాగా, కరీంనగర్ నియోజకవర్గంలో 144 మంది లబ్ధిదారులకు రూ. 1.43 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీ లక్ష్మయ్య, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు అండగా ఉంటం
పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లంగా ఉండాలి. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పేదల కోసం ఇలాంటి పథకాలు తీసుకురాలేదు. మాలాంటి పేదల గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ ఎంతో మంచి పథకం తీసుకువచ్చారు. ఆడపిల్ల పెళ్లికి ఇంటి పెద్దగా రూ. లక్ష ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పటికి ఉండాలి. సీఎం కేసీఆర్కు అండగా ఉంటం. – కవిత, కొత్తపల్లి
ఆనందంగా ఉంది
ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వమే రూ. లక్షా నూటపదహార్లు అందించడం ఆనందంగా ఉంది. గతంలో ఉన్న సీఎంలు ఎవ్వరు కూడ పేదల గురించి ఆలోచించి ఇలాంటి పథకాలను తీసుకురాలేదు. కానీ, సీఎం కేసీఆర్ మాలాంటి వారిని గుర్తు పెట్టుకొని మా కష్టాలను తీర్చేందుకు అనేక పథకాలను తీసుకువస్తున్నారు. ఇలాంటి నాయకులు నిండు నూరేళ్లు జీవించాలి. ఆర్థిక సాయం చేసిన కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటం. – ఖలీజ, కరీంనగర్