వేములవాడ, అక్టోబర్ 18: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ కాంట్రాక్టర్‌కు పనుల గడువు పొడిగింపు కోసం మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు రూ.50వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ సూపర్వైజర్ ద్వారా కమిషనర్ రూ.30 వేలు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్ సుంకరి మహేశ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నాడు. రూ.2.71కోట్లతో శ్యామకుంట సమీకృత మార్కెట్ భవనం, తెట్టకుంటలో రూ.1.20కోట్లతో డంప్‌యార్డులో పలు పనులు చేస్తున్నాడు. అయితే టెండర్ ప్రకారం సంబంధిత పనుల గడువు ఆరునెలల క్రితమే ముగిసిపోగా, మరింత పొడిగించాలని గత ఏప్రిల్‌లో మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావును మహేశ్ కోరాడు. అయితే చేస్తున్న పనుల్లో ఒక శాతం కమిషన్ ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేయడంతో మహేశ్ ఒప్పుకోలేదు.
ఈ క్రమంలో ఇటీవల మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. కమిషనర్ ఒప్పుకోకపోవడంతో తన వద్ద పనిచేస్తున్న సూపర్వైజర్ సత్యం ద్వారా మహేశ్ సంప్రదింపులు జరిపాడు. రూ. 50వేలు ఇస్తే గడువు పొడిగిస్తానని కమిషనర్ చెప్పడంతో సత్యం విషయాన్ని మహేశ్‌కు చెప్పాడు. చివరకు రూ.30వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఇదే సమయంలో మహేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనుకున్న ప్రకారం మహేశ్ తన సూపర్ వైజర్ సత్యం ద్వారా మంగళవారం మున్సిపల్ ఆఫీసులో కమిషనర్‌కు రూ.30 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు కమిషనర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కరీంనగర్‌లోని కమిషనర్ నివాసంలోనూ సోదాలు జరిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కమిషనర్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ వెల్లడించారు. తనిఖీల్లో సీఐలు ఎస్ రవీందర్, తిరుపతి, జాన్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
మారువేషంలో వచ్చి.. పట్టుకొని..
ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి పూర్తిగా మారువేషంలో వచ్చారు. సాదాసీదా దుస్తులు ధరించడమే కాకుండా మెడలో కండువాలు వేసుకొని రెండుగంటలపాటు కార్యాలయంలో పడిగాపులు గాశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కమిషనర్ తన చాంబర్ నుంచి కిందికి దిగుతుండగా ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో మరికొందరు ఉద్యోగులు బయటకు వెళ్తుండగా, అడ్డుకొని విచారణ జరిపారు.
రెండు నెలల్లో రెండు దాడులు
వేములవాడ పట్టణంలో గడిచిన రెండు నెలల్లోనే ఇద్దరు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతున్నది. ఆగస్టు 18న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ కోసం హెడ్‌కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ రూ.6వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. సరిగ్గా రెండు నెలలు గడువకముందే మున్సిపల్ కమిషనర్ పట్టుబడడం ఆ శాఖలో కలకలం రేపింది.