విద్యానగర్, అక్టోబర్ 17: వాహనాలు నడిపే ప్రతి ఒకరూ ట్రాఫిక్ రూల్స్ తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్ అన్నారు. వరల్డ్ ట్రామాడే సందర్భంగా సోమవారం మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యంగా జీవించడానికి మనిషి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లే ప్రమాదాలను నివారించేందుకు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. వాహనంపై ప్రయాణించేవారు సమయానికి ముందే చేరేలా ప్లాన్ చేసుకుంటే హడావిడిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదం బారిన పడితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ప్రమాదంలో అవయవాలు కోల్పోయి ఎందుకు బతుకుతున్నామనే వేదనతో చాలా మంది జీవితాలను వెళ్లదీస్తున్నారన్నారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దంటే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలు కావడంతో చాలా మంది చనిపోతున్నారని తెలిపారు. ముఖాన్ని పూర్తిగా కవర్ చేసే హెల్మెట్ వాడితే తలకు రక్షణగా ఉంటుందన్నారు. హెల్మెట్ వాడకంతో వెంట్రుకలకు, ముఖానికి ఇబ్బంది అవుతుందని భావించి హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేసి ప్రమాదాల్లో గాయపడిన వారు ఏ విధమైన బాధలు అనుభవిస్తారో కూలంకశంగా వివరించారు. ఈ సందర్భంగా మైనర్లు వాహనాలు నడపడం, స్పీడ్ డ్రైవ్‌తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరుపై దవాఖాన సిబ్బంది ప్రదర్శించిన సిట్ అందరినీ ఆకట్టుకుంది. దవాఖాన అడ్మినిస్ట్రేట్ గుర్రం కిరణ్ నేతృత్వంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర, న్యూరోసర్జన్ శ్వేత, కార్డియాథొరాసిక్ సర్జన్ డాక్టర్ సదాశివ్ తమగొండ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ వైద్యులు అభిషేక్, అక్షయ్, ప్రవీణ్‌కుమార్, గైనకాలజిస్టు ప్రతిష్టారావు, మెడికల్, నర్సింగ్ సూపరింటెండెంట్లు రీటా, రోహిణి, మారెటింగ్ హెడ్ ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.