కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : దళితుల జీవితాల్లో వెలుగులు పంచుతున్న దళిత బంధు పథకం మరింత వేగవంతమైంది. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించగా, ఈ నియోజకవర్గంలో 17,554 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 9.90 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకాన్ని గత ఆగస్టు 16న శాలపల్లి-ఇందిరానగర్ గడ్డపై ప్రారంభించినప్పుడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందుకున్న జిల్లాకు చెందిన 12 మందికి హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. అందులో 5 ట్రాన్స్పోర్ట్ వాహనాలు, 3 మినీ డెయిరీలు, మరో 4 సర్వీస్ సెక్టార్లో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు యూనిట్లు ఎంపిక చేసుకున్నారు. ఎన్నికల తర్వాత మరో 54 మందికి మొత్తం 66 మందికి వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేశారు.
డెయిరీ యూనిట్లకు ప్రాధాన్యత..
దళిత బంధులో డెయిరీ యూనిట్లకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు ఈ యూనిట్లను ఎంచుకుని మంచి లాభాలు పొందుతున్న కారణంగా ఈ యూనిట్లనే ఎక్కువ ఎంపిక చేసుకోవాలని అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు 1,506 మంది డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు సమ్మతిస్తూ అధికారులకు అంగీకార పత్రాలు అందించారు. అయితే డెయిరీ ఏర్పాటుకు కొంత భూమి అవసరమని భావించిన అధికారులు సర్వే చేసి, 1,103 మందికి షెడ్ల నిర్మాణానికి, గడ్డి పెంచుకోవడానికి భూమి ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బ్యాచ్‌కి ఆరు రోజుల పాటు కరీంనగర్లో పలు దఫాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు హాజరైన 801 మందికి ఒక్కొక్కరికి 1.50 లక్షల చొప్పున మంజూరు చేశారు.
ప్రస్తుతం షెడ్ల నిర్మాణం వేగంగా సాగుతుండగా, లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు తీసుకెళ్లి పాడి పశువులను కొనుగోలు చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వీస్ రంగంలో వ్యాపారులు చేయాలనుకునే 558 మందిని గుర్తించారు. వీరి నుంచి కొటేషన్లు సేకరించే బాధ్యతలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. ఇప్పటికే 180 మంది లబ్ధిదారులు కొటేషన్లు అందించారు. వీరు ఎంపిక చేసుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇక రవాణా రంగంలో అయితే పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆర్టీఏ అధికారుల సహకారంతో మెగా లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి సుమారు 2,500 మందికి లైసెన్స్‌లు ఇప్చించారు. వీరిలో గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఒక్కో యూనిట్‌ను గ్రౌండింగ్ చేయడంలో అధికారులు వేగాన్ని పెంచారు.
వారంలో 500 యూనిట్లు లక్ష్యం..
లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నందున వారంలో కనీసం 500 యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు క్లస్టర్ అధికారులుగా ఉన్న 28 మందికి బాధ్యతలు అప్పగించారు. వీరంతా లబ్ధిదారులకు యూనిట్లపై అవగాహన కల్పించి, వారు ఎంచుకున్న యూనిట్లకు ఎంపిక చేస్తున్నారు. అయితే లబ్ధిదారులు ఏ సెక్టార్‌ను ఎంచుకున్నా వారికి నాలుగు నుంచి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న లబ్ధిదారులకే యూనిట్లు గ్రౌండింగ్ చేస్తామని చెబుతుండడంతో లబ్ధిదారులు కూడా శిక్షణ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. సెక్టార్ల వారీగా వీరిని విడదీసి అధికారులు శిక్షణ ఇస్తున్నారు.
అంతే కాకుండా ఒక్కరు రెండు మూడు యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి ఇంకా పెద్ద మొత్తంలో యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అధికారులు శిక్షణ ఇస్తున్నారు. లబ్ధిదారులతో అందుకు అవసరమైన గ్రూపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21న కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఇచ్చిన యూనిట్లు గ్రూపుల వారీగా ఇచ్చినవే కావడం విశేషం. మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా 10 యూనిట్లను 24 గ్రూపులకు ఇచ్చారు. ఈ విధంగా గ్రూపులు చేసి వారికి శిక్షణ ఇచ్చి యూనిట్లు గ్రౌండింగ్ చేస్తేనే వారికి సదరు యూనిట్‌పై పూర్తిగా అవగాహన వచ్చి సద్వినియోగం చేసుకుంటారని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని త్వరగా పూర్తి చేసి రాష్ర్టానికి రోల్‌మోడల్‌గా ఉంచాలని జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.