వీర్నపల్లి, అక్టోబర్ 14: ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడడంతో ఆ మహిళా రైతు మృతిచెందింది. ఈ ఘటన వీర్నపల్లి మండలం మద్దిమల్ల లోద్దితండాలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన గిరిజన మహిళ కోడవత్ లలిత(42) గొర్రెలను మేపేందుకు తమ పొలానికి వెళ్లింది.
సాయంత్రం భారీ వర్షం కురుస్తుండగా పిడుగుపడడంతో తీవ్ర గాయలపాలైంది. స్థానికులు గమనించి చికిత్స కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. గతేడాది వ్యవసాయ పనులు చేస్తుండగా లలిత పిడుగుపాటుకు గురై తీవ్రగాయాలపాలైంది. శుక్రవారం పడిన పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ ఘటనతో గ్రామస్తులతో పాటు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలికి భర్త శంకర్, కూతుర్లు మౌనిక, దీపిక, కీర్తి, కుమారుడు మారుతి ఉన్నారు.