కరీంనగర్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ) : పశువులను వణికిస్తున్న లంపీస్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి) దళితబంధు పథకంపైనా ప్రభావం చూపుతున్నది. ఇతర రాష్ర్టాల నుంచి పశువుల రవాణాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ‘పాడి యూనిట్ల గ్రౌండింగ్’ నిలిపేస్తున్నట్లు యంత్రాంగం స్పష్టం చేసింది. లంపీస్కిన్ అంటువ్యాధి కావడం, ఉత్తరాది రాష్ర్టాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా ఇది ఇప్పట్లో తగ్గే పరిస్థితి కూడా కనిపించకపోవడం కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకుని, గ్రౌండింగ్ కాని లబ్ధిదారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మరో అవకాశం ఇచ్చారు. వీరు ఇతర యూనిట్లకు మారాలని, వెంటనే గ్రౌండింగ్ చేస్తామని చెబుతున్నారు. ఇటు అధికారులు కూడా ఇతర యూనిట్లను ఎంచుకోవాలని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం నిధులతో పాడిపశువులు కొనుగోలు చేసుకున్న వారు, మిగతా 50 శాతం నిధులతో ఇతర యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఉత్తరాది రాష్ర్టాలను వణికిస్తున్న లంపీస్కిన్ డిసీజ్ ఎఫెక్ట్ మన రాష్ట్రంలోనూ కనిపిస్తున్నది. అయితే ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ వ్యాధి ప్రభావం దళితబంధు లబ్ధిదారులపై నేరుగా పడుతున్నది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని దళితబంధు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పాడి పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో జిల్లా అధికారులు ఎక్కువగా ఆ యూ నిట్లవైపు మొగ్గు చూపారు. లబ్ధిదారులను కూ డా ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో 1,508 యూనిట్లను లబ్ధిదారులు ఎంచుకున్నారు. అందులో ఇప్పటికే 1,300 యూనిట్లకు 50 శాతం చొప్పున ఒక్కో యూనిట్‌కు నాలుగు పశువుల చొప్పున ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి ఇప్పించారు. హర్యానా, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాలకు లబ్ధిదారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా వెళ్లి పశువులను కొనుగోలు చేసుకున్నారు. ఈ రకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు పట్టణాల్లో కలిపి 5,200 పశువులను ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చారు. ఇదే యూనిట్లకు మరో 5,200 పాడి పశువులు రావల్సి ఉన్నది. ఈలోగా ఉత్తరాది రాష్ర్టాల్లో లంపీస్కిన్ డిసీజ్ వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర రాష్ర్టాల నుంచి పశువులను రాష్ర్టానికి రాకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది.
40 రోజుల కిందే నిలిచిన కొనుగోళ్లు..
పశువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి తరలించడకుండా రవాణాపై ఆంక్షలు విధించారు. ఒకవేళ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పశువులను తరలించాల్సి వస్తే 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఉత్తర భారతంలో ఉన్న హర్యానా నుంచి తెలంగాణకు రావాలంటే పలు రాష్ర్టాలు దాటి రావాల్సి ఉంటుంది. అయితే ఒక్కో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పశువులను 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచాల్సి ఉంటుంది. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుంటే ఆ చెక్‌పోస్టుల వద్ద వదులుతారు. ఈ లెక్కన పశువులు తెలంగాణకు చేరుకోవాలంటేనే నాలుగైదు నెల లు పడుతుంది. ఈ కారణంగానే దళితబంధు కింద డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన లబ్ధిదారులకు 40 రోజుల కిందటి నుంచే గ్రౌండింగ్ నిలిపేశారు. ఇటీవల కొందరు లబ్ధిదారులు, పశు వైద్యాధికారులు హర్యానా రాష్ట్రంలో పశువులను కొన్న సమయంలోనే వెనక్కి ఇచ్చి వచ్చేశారు. లంపీస్కిన్ డిసీజ్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వ్యాధి ప్రభావం ఇతర రాష్ర్టాల్లో కంటే తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నది. ఇతర రాష్ర్టాల పశువులు రవాణా చేస్తే అంటువ్యాధి అయిన లంపీస్కిన్ రాష్ట్రంలో తీవ్ర వ్యాప్తి చెందే ప్రమాదమున్నది. అంతేకాకుండా ఈ వ్యాధి ఇప్పట్లో తగ్గే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాడి యూనిట్ల గ్రౌండింగ్‌ను పూర్తిగా నిలిపి వేస్తూ సదరు లబ్ధిదారులను ఇతర యూనిట్లకు మారాలని కోరుతున్నారు.
ఇతర యూనిట్లకు మారడమే..
దళితబంధు కింద హుజూరాబాద్ నియోజకవర్గానికి 5,200 పశువులను ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి తెచ్చారు. ఇవన్నీ నల్ల జాతి (బర్రెలు) పశువులే కాగా, ఇప్పటివరకు వీటిపై లంపీస్కిన్ ప్రభావం కనిపించడం లేదు. అయితే పాత 1,300 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రెండో విడుతలో మరో 4 పశువుల చొప్పున కొనుగోలు చేసినా 5,200, కొత్త యూ నిట్లు 208కి ఒక్కో యూనిట్‌కు 8 పశువుల చొప్పున కొనుగోలు చేసినా 1,664 పశువులు రావాల్సి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో పశువులను రవాణా చేయించాలంటే కష్టంతో కూడినపని. ఈ నేపథ్యంలో యూనిట్లు మార్చుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ కర్ణన్ సహా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సూచిస్తున్నారు. మొదటివిడుత కింద పాడి పశువులు తెచ్చుకున్న లబ్ధిదారులకు ఇంకా మిగిలి ఉన్న 5 లక్షలతో ఇతర యూనిట్లను నెలకొల్పుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎలాంటి యూనిట్లనైనా ఏర్పాటు చేసుకోవచ్చని, లేదంటే గ్రూపులుగా ఏర్పడి పెద్ద వాహనాలు కూడా కొనుక్కోవచ్చని చెబుతున్నారు. ఇక డెయిరీ యూనిట్లు మంజూరై ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాని 208 మంది లబ్ధిదారుల్లో చాలా మందికి షెడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 1.50 లక్షలు మంజూరు చేశారు. ఇవీ పోను మిగిలిన మొత్తానికి సరిపడే యూనిట్లును ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పాడి పశువులపై ప్రత్యేక దృష్టి
దళితబంధు కింద ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన పాడి పశువులపై పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా మండలాల పశువైద్యాధికారులతో ప్రతిరోజూ పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ జేడీ బండారి నరేందర్ తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క పశువులో కూడా లంపీస్కిన్ డిసీజ్ సోకిన దాఖలాలు కనిపించ లేదని ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే అక్కడకు ల్యాబ్ నుంచి టెక్నీషియన్లను పంపి, షాంపిల్ తెప్పించి హైదరాబాద్ పంపిస్తున్నామని అన్నారు.
డెయిరీ లబ్ధిదారులు యూనిట్లు మార్చుకోవాలి
డెయిరీ ఫాం ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా యూనిట్లు మార్చుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకుంటున్నాం. యూనిట్లు మార్చుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క విడుత కూడా గ్రౌండింగ్ చేయని 208 మంది లబ్ధిదారులు ఎక్కువగా కార్లు, ట్రాక్టర్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. వీరికి టెంపరెరీ లైసెన్స్ ఉన్నా వాహనాలు మంజూరు చేస్తున్నాం. ఇక ఇప్పటికే డెయిరీ యూనిట్ల నుంచి ఒక విడత కింద 4 పశువులు తీసుకున్న లబ్ధిదారులు మిగతా మొత్తంతో వారికి ఇష్టమైన యూనిట్లను ఎంపిక చేసుకోవల్సిందిగా కోరుతున్నాం. వీరు గ్రూపులుగా ఏర్పడి వాహనాలు కొనుగోలు చేసుకుంటామని చెప్పినా ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. పశువుల్లో వచ్చే లంపీస్కిన్ డిసీజ్ కారణంగానే ఈనిర్ణయం తీసుకున్నాం. లబ్ధిదారులు అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం.
– డీ సురేశ్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి
(కరీంనగర్)