ముకరంపుర, అక్టోబర్ 10: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నిధులు కేటాయించాలని కోరుతూ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు పాలకవర్గంతో కలిసి సోమవారం మంత్రి గంగుల కమలాకర్‌కు కలెక్టరేట్లో విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులోని పండ్ల మార్కెట్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు సీజన్ల వారీగా వివిధ రకాల పండ్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని వివరించారు. ఏటా మార్కెట్‌కు వచ్చే రైతుల సంఖ్య పెరుగుతున్నదని, ఇందుకు తగిన విధంగా పండ్ల మార్కెట్లో అదనంగా రెండు షెడ్ల నిర్మాణంతో పాటు సౌకర్యాలు కల్పించాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం నిర్ణయించిందన్నారు. కమిటీలో నిధుల లభ్యత సరిపడా లేనందున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ నుంచి రూ.3కోట్లు లోన్ రూపంలో కేటాయించాలని విన్నవించారు.
రెండు షెడ్ల నిర్మాణంతో పాటు రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుంటుందని వివరించారు. సత్వరమే సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ నుంచి కరీంనగర్ మార్కెట్ కమిటీకి రూ.3కోట్ల నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. సానుకూలంగా స్పందించిన మంత్రికి మార్కెట్ కమిటీ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, డైరెక్టర్లు కర్నాటి చలమయ్య, పబ్బతి రంగారెడ్డి, గుంటి రాజమల్లు, సోమిరెడ్డి లక్ష్మారెడ్డి, గోలి మల్లయ్య, గంగాధర లస్మయ్య, గుండేటి అనిత, చంద్రపల్కల అంజయ్య, బోనాల జనార్దన్, ఎండీ మహమూద్పాషా, విజయ్‌కుమార్ ముందడా, శివనాథుని వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.