తిమ్మాపూర్ రూరల్, జనవరి 29: ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్లపై రుసుమును పెంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో తహసీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలవద్ద శనివారం రైతులు, రియల్టర్ల తాకిడి పెరిగింది. రిజిస్ట్రేషన్లను ఈ నెలలో చేసుకుంటేనే చలాన్లు తక్కువవుతుండడంతో భూములు కొనుగోలు చేసుకున్న వారు స్లాట్ బుక్ చేసుకున్నారు. ధరిణి వెబ్సైట్ నెమ్మదించడంతో ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల వద్దనే వేచిఉన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో సైట్ నెమ్మదించిందని, రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేసిన్నట్లు ఆపరేటర్లు పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఇబ్బందికలగకుండా అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పంపించారు.
రిజిస్ట్రేషన్ల జాతర
వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరుగనుండడంతో మానకొండూర్ మండల తహసీల్ కార్యాలయంలో శనివారం రైతుల, భూ కొనుగోలు, విక్రయదారుల తాకిడి పెరిగింది. దీంతో సర్వర్ బీజీగా ఉండడంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి. తహసీల్ కార్యాలయ సిబ్బంది రాత్రి వరకు ఫొటోలతో పాటు ఈకేవైసీలను తీసుకున్నారు. శంకరపట్నం మండలంలో కూడా రిజిస్ట్రేషన్ల కోసం రైతన్నలు వేచి చూడాల్సి వచ్చింది. సిబ్బంది రాత్రి వరకు సమయం తీసుకుని సేవలందించడంతో రైతులు అభినందిస్తున్నారు.