కార్పొరేషన్, అక్టోబర్ 2: కరీంనగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు పండుగను సంబురంగా జరుపుకోవాలని నగర మేయర్ వై సునీల్‌రావు సూచించారు. ఆదివారం నగరంలోని మానేరు డ్యాం ఆనకట్ట పరీవాహక ప్రాంతంలో గల మారండేయనగర్, శివనగర్, సప్తగిరికాలనీ, శ్రీనగర్‌కాలనీ, రాంచంద్రపూర్ కాలనీ, కట్టరాంపూర్, గౌతమినగర్, వేదభవన్ మానేరు వాగు, గార్లకుంట తదితర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి నగరపాలక సంస్థ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
మానేరు డ్యాం కట్ట సమీపంలో గల అన్ని బతుకమ్మ నిమజ్జన పాయింట్లతో పాటు గార్లకుంట, చింతకుంట, కొత్తపల్లి, మానకొండూర్ చెరువు వద్ద కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. బతుకమ్మ నిమజ్జనం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. అదనంగా పాయింట్ల వద్ద జనరేటర్ల సౌకర్యం, మంచినీటి వసతి కూడా కల్పించామన్నారు.
నగరంలోని డివిజన్లలో బతుకమ్మ ఆడే ప్రతిచోటా చకని లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. నగరవ్యాప్తంగా మూడు వేల లైట్లు అమర్చామని, రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశామన్నారు. నగర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, చొప్పరి జయశ్రీవేణు, మహేశ్, ఆకుల నర్మదానర్సయ్య, తోట రాములు, మాజీ కార్పొరేటర్ ఏవీ రమణ, నగరపాలక అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.