గన్నేరువరం, అక్టోబర్ 2: మండలంలోని ఖాసీంపేట గ్రామం స్వచ్ఛతలో భేష్ అని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కితాబిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాసీంపేట గ్రామంలో ఆదివారం సర్పంచ్ గంప మల్లీశ్వరి-వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో వాడవాడలా తిరిగి పారిశుధ్య పనులు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం వందశాతం అమలు చేయడం అభినందనీయమన్నారు. ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారని గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీర బుచ్చయ్య, ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఎస్బీఎం కిషన్ స్వామి, ఉప సర్పంచ్ బద్ధం సంపత్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.