కార్పొరేషన్, జనవరి 28: నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు శివారు ప్రాంతాల్లో వేసవిలోగా ఇంటింటికీ ప్రతి రోజూ మంచినీటి సరఫరా అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ నగర అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లిన వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయిస్తున్నారని తెలిపారు. వారి సహకారంతో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మేయర్ వై సునీల్‌రావు శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో ఈ రెండేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న పట్టణ ప్రగతి నిధులతో ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదకర వాతావరణం కోసం చేపట్టిన పనుల వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు పట్టణ ప్రగతి నిధులు రూ. 57 కోట్లు రాగా, రూ. 40 కోట్లతో వైకుంఠధామాల నిర్మాణం, 30 ఓపెన్ జిమ్‌లు, 15కు పైగా వాకింగ్ ట్రాక్‌లు, 18 పార్కు స్థలాల్లో సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ఎనిమిది పార్కుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో అన్ని పార్కుల్లో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
స్మార్ట్‌సిటీ పనులు వేగవంతం
నగరంలో స్మార్ట్‌సిటీ నిధులు రూ.353 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటికే సుమారు రూ.300 కోట్ల పనులు పూర్తి కాగా… మిగతావి తుది దశకు చేరినట్లు మేయర్ తెలిపారు. టవర్ సర్కిల్ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగిందని, వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే, కొత్తగా స్మార్ట్‌సిటీ కింద రూ. 650 కోట్ల అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయని, మార్చి 31వ తేదీలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు గ్రౌండింగ్ కూడా చేస్తామని వెల్లడించారు. పనులు ఏడాదిలోగా పూర్తి చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. వీటిలో కమాండింగ్ కంట్రోల్ సెంటర్, డంప్ యార్డు క్లీన్, ఈ-లెర్నింగ్ తరగతులు, వరద కాలువ నిర్మాణ పనులు ఉన్నాయని వివరించారు.
ఏడాదిన్నరగా రోజూ మంచినీటి సరఫరా
నగరంలో అర్బన్ మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఏడాదిన్నరగా ప్రతి రోజూ మంచినీటి సరఫరాను విజయవంతంగా కొనసాగిస్తున్నామని మేయర్ చెప్పారు. విలీన గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు వేస్తున్నామని, వేసవిలోగా రోజూ మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీని ద్వారా రోజూ మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక నగరంగా కరీంనగర్ నిలుస్తుందని చెప్పారు. దీంతో పాటు స్మార్ట్‌సిటీ కింద మూడు రిజర్వాయర్ల పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరాను పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని, దీనికోసం అనుమతులు తీసుకున్నామని తెలిపారు. టెండర్లు పూర్తి చేసి మార్చిలోగా పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఏడాదిలో నగర వ్యాప్తంగా 24 గంటలు మంచినీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
పారిశుధ్యం మెరుగుకు చర్యలు
నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. పారిశుధ్య పనులు చేపట్టేందుకు అధునాతన యంత్రాలను కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు ఇంటింటా చెత్త సేకరణ కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత పటిష్టమైన చర్యలు చేపడుతామన్నారు. ఇంటింటా సేకరించిన చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు ప్రస్తుతం ఒక డీఆర్సీ కేంద్రం మాత్రమే ఉందని, త్వరలోనే నగరం నలువైపులా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే ఏళ్లుగా ఉన్న డంప్‌యార్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నిత్యం వచ్చే చెత్తను యంత్రాల ద్వారా క్లీన్ చేస్తామన్నారు. సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్ పోటీలో దేశంలోనే నగరం రెండో స్థానం నిలువడంతో మరిన్ని పనులు చేపట్టేందుకు అవకాశం వచ్చిందన్నారు.
శివారు కాలనీల అభివృద్ధి
నగరంలోని శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మేయర్ తెలిపారు. వేసవిలోగా రోజూ మంచినీరు సరఫరా చేసేందుకు పైపులైన్ పనులు చేపడుతున్నామన్నారు. అలాగే, వివిధ గ్రాంట్ల కింద వచ్చే నిధులను శివారు డివిజన్ల అభివృద్ధికి కేటాయించి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలో వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా రూ.130 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన మురుగు కాలువలను అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ వర్షపు నీరు మురుగు కాలువల్లోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే, నగరంలో భూగర్భ డ్రైనేజీని మరింత విస్తరించేందుకు రూ.40 కోట్లతో త్వరలోనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.