హుజూరాబాద్, జూలై 3: ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరు వచ్చినా ఆర్యవైశ్యుల సాధకబాధకాలు పట్టించుకోలేదు. ఆర్యవైశ్య సంఘానికి సొంత భవనం కావాలని 60 ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు. చివరికి బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కూడా ఎన్నోసార్లు భవనం కోసం స్థలం కావాలని వినతిపత్రాలు సమర్పించారు. ఓట్లయితే దండుకున్నారే కానీ వారి విన్నపాలను బుట్టలో వేశారు. ఆర్యవైశ్యులు అడిగిందే తడవుగా బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భవనం కోసం వారం రోజుల్లో స్థలం కేటాయిస్తారని హామీ ఇచ్చారు. అంతే కాకుండా రూ.కోటి నిధులను మంజూరయ్యేలా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే ఆర్యవైశ్యుల కోసం స్థలం, నిధులను మంజూరు చేశారు. కేసీ క్యాంపులో సబ్‌స్టేషన్ ఎదురుగా ఎకరం స్థలం, రూ.కోటిలో తక్షణమే రూ.50లక్షలను కేటాయించారు. దీంతో ఆర్యవైశ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నేడు ఆత్మీయ భవనానికి భూమిపూజ
ఆర్యవైశ్యుల ఆత్మీయ భవనానికి ఆదివారం భూమిపూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరు కానున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్రస్థాయి ఆర్యవైశ్య ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్ కోరారు.
సంతోషంగా ఉంది
ఆర్యవైశ్యుల సంఘ భవన నిర్మాణం జరుగడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోలేదు. ఆర్యవైశ్యులను రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తించిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే. ఎల్లప్పుడూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం.
ఆర్యవైశ్యులందరం రుణపడి ఉంటాం
ఆర్యవైశ్యులందరం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. విలువైన ఎకరం స్థలం ఆర్యవైశ్యులకు కేటాయించినందుకు కేసీఆర్ ధన్యవాదాలు. స్థలం, భవన నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
గత ప్రభుత్వాలు ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించాలని కోరినా పట్టించుకోలేదు. అడిగిన వెంటనే స్థలం, నిధులు కేటాయించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం. గతంలో కన్నా ఎంతో వేగంగా అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టణ ప్రజలు రుణపడి ఉంటారు.
టీఆర్ఎస్ విజయంలో పాలుపంచుకుంటాం
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయంలో పాలు పంచుకుంటాం. ఆర్యవైశ్యులందరు ఏకతాటిపైకి రావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్యవైశ్యులందరు పెద్ద మొత్తంలో హాజరై ఆత్మీయ భవన భూమిపూజ నిర్మాణంలో పాల్గొనాలి.