తమిళనాడులోని తిరుప్పూర్ నుంచి ఏటా ప్రపంచ విపణిలోకి 40 వేల కోట్ల వస్త్ర ఎగుమతులు చేస్తున్నారు. సిరిసిల్లలో 2 వేల కోట్లు మాత్రమే చేస్తున్నారు. కొత్త తరహా ఆలోచనలతో తిరుప్పూర్‌కు దీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దేలా ఆలోచనలు చేస్తున్నాం. ఇప్పటికే న్యూజిలాండ్‌లో ‘రాజన్న సిరిపట్టు’ పేరిట సిరిసిల్ల చీరలకు బ్రాండింగ్ చేస్తున్నాం. మహిళల అభిరుచులకు అనుగుణంగా బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నాం. నేతన్నల అభివృద్ధికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడతాం.
– బతుకమ్మ చీరల పంపిణీలో మంత్రి కేటీఆర్
సిరిసిల్ల కలెక్టరేట్, సెప్టెంబర్ 22 : కొత్త తరహా ఆలోచనలు, సీఎం ఆశీస్సులతో తమిళనాడులోని తిరుప్పూర్‌కు దీటుగా టెక్స్టైల్ టౌన్ సిరిసిల్లను తీర్చిదిద్దేలా కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అక్కడి వస్త్ర పరిశ్రమను పరిశీలించి రావాలని పవర్‌లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెక్రటరీ బుద్ధ ప్రకాశ్‌కు సూచించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి చీరలు అందజేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వు చూసేందుకు, సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించేందుకు, ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారెగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల కోసం 300 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు 40 శాతం, మర కార్మికులకు 10 శాతం నూలు రాయితీ ఇస్తున్నామన్నారు.
సిరిసిల్ల పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 8 వేల నుంచి 10 వేల మంది మహిళలకు త్వరలోనే ఉపాధి కల్పిస్తామన్నారు. పెద్దూరులో 80 ఎకరాల్లో వీవింగ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా ఈ సారి కూడా కోటి చీరలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రం మొత్తానికి బతుకమ్మ పండుగ కానుకగా అందించే చీరలు సిరిసిల్ల నుంచే ఉత్పత్తి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఇంకా ఎవరైనా పింఛన్లు రాని అర్హులుంటే వారికి అందిస్తామన్నారు.
త్వరలోనే సొంత స్థలంలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరఫున 3 లక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, చేనేత జౌళి శాఖ కమిషనర్ బుద్ద ప్రకాశ్‌జ్యోతి, కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షు డు గడ్డం నర్సయ్య, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ చక్రపాణి, రామతీర్థపు మాధవి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షు డు జిందం చక్రపాణి, అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసాద్, ఎన్ఖిమ్యానాయక్, ఆర్డీవో టీ శ్రీనివాసరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
డిజైన్లు బాగున్నయ్
మునుపటి కంటే ఈసారి చీరల డిజైన్లు బాగున్నయ్. సీఎం కేసీఆర్ ఆడపడుచులకు ప్రేమ పూర్వకంగా అందించే చిరు కానుక చాలా నచ్చింది. ఈ పండుగకు సర్కారు ఇచ్చిన చీరను కట్టుకుని బతుకమ్మ ఆడుతా. రంగురంగుల చీరెలను మంచిగ తయారు చేసిండ్రు. పండుగకు కానుక ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
– మేర్గు జల, మారుపాక (వేములవాడ)
పేద మహిళలకు మేలు
పండుగ వచ్చిందంటే చీర కొనడానికి బాగా ఖర్చయ్యేది. ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నయి. సీఎం కేసీఆర్ పుణ్యమాని పండుగకు పేదింటి ఆడపడుచులు చీరలకయ్యే ఖర్చులు ఆదా అవుతున్నయి. సీఎం సార్ సల్లంగుండాలె. చీరల రంగులు, డిజైన్లు బాగున్నయి.
– కే భారత, మామిడిపల్లి (కోనరావుపేట)
కేసీఆర్ సారు పంపిండు
బతుకమ్మ పండుగ వస్తే సంబరమయితది. పండుగకు పుట్టింటి నుంచి వచ్చినట్లు సీఎం కేసీఆర్ సార్ చీర పంపుతుండు. చీరలు సూపర్గ ఉన్నయి. గతంల ఏ సర్కారు గూడ గిట్ల మహిళలను పట్టించుకోలె. తెలంగాణ వచ్చినంక సీఎం సర్ అందరికీ పెద్ద దిక్కయిండు. సీఎం సార్‌కు దండాలు.
– వన్నం కమలవ్వ, కార్మికురాలు (కోనరావుపేట)
మూడు రోజుల ముందే వచ్చినయ్
బతుకమ్మ పండుగకు మంచి చీరలు ఇచ్చిన సీఎం సార్‌కు కృతజ్ఞతలు. ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరలతో పండుగ సంబరంగా జరుపుకుంటం. బతుకమ్మ పండుగకు మూడు రోజుల ముందే చీరలు ఇచ్చిండ్రు. మాకు చాలా ఆనందంగా ఉంది.
– ఎం లత, మామిడిపల్లి (కోనరావుపేట)