హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘ప్రశ్నించడమే పాపమైందా? ముఖ్యనేత, ఆయన సోదరుల దురాగతాలు, భూదందాలను బహిరంగంగా నిలదీయడమే శాపమైందా? ప్రశ్నించినందుకు పగపట్టి, వెంటాడి, వేటాడి మరీ కాటేశారా? ప్రశ్నిస్తే పదవి కోల్పోవాల్సిందేనా?’ అంటే ఈ ప్రశ్నలను కాంగ్రెస్ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వ్యక్తమవుతున్నది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ మంత్రి పదవి పోవడానికి ప్రశ్నించడమే కారణమనే చర్చ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాలపై కొండా సురేఖ కూతురు కొండా సుస్మితాపటేల్ బహిరంగంగా ప్రశ్నలు సంధించారు.
ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల భూదందా, కంపెనీలకు భూములు కేటాయించడంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్కడ ఎంత దోచేశారో, ఎక్కడ ఏ దందా చేశారో లెక్కలన్నీ తన వద్ద ఉన్నాయని, అవసరమైతే అవన్నీ బయటపెడుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇది కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపింది. అప్పటివరకు సీఎం, ఆయన సోదరులపై సొంత పార్టీలో ఆ స్థాయిలో మాట్లాడింది ఎవరూలేరు. దీంతో ప్రభుత్వ పెద్దల గుండెల్లో గుబులు రేగిందని చెప్తున్నారు. అందుకే వాళ్లను అదుపులో పెట్టేందుకు గతంలోనే బర్తరఫ్ వ్యూహాన్ని ముఖ్యనేత తెరపైకి తీసుకొచ్చారు. అయితే, అప్పట్లో గొడవ సర్దుమనగడంతో ఎక్కడి వాళ్లు అక్కడ నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ, ఇద్దరి మనుసుల్లోని విభేదాలు మాత్రం చల్లారలేదు.
కొండా వర్సెస్ పొంగులేటి, జిల్లా నేతలు
కొండా కుటుంబానికి వరంగల్ జిల్లా పెట్టనికోట అనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యనేత ముందుగా వారిని ఒంటరిని చేసే వ్యూహం పన్నారనే చర్చ నడుస్తున్నది. వరంగల్ ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆమెకు వ్యతిరేకంగా మార్చారనే చర్చ జరుగుతున్నది. ఇందులో ముఖ్యనేత సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. మంత్రి కొండా సురేఖకు, మంత్రి పొంగులేటికి మధ్య ఏ మాత్రం పొసగని పరిస్థితి ఏర్పడింది. పొంగులేటి వరంగల్ జిల్లా పర్యటనలకు ఆమె గైర్హాజరయ్యేవారు. సమీక్షలకు కూడా హాజరయ్యేవారు కాదు. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి అవినీతికి పాల్పడ్డారని, తన వాళ్లకే కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. జిల్లా నేతలను సైతం ఆమెకు దూరం చేసి ఒంటరి చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టికెట్ ప్రకటించి.. రెచ్చగొట్టి..
ముఖ్యనేత వేసిన ఉచ్చులో కొండా కుటుంబం పడిపోయిందనే చర్చ జరుగుతున్నది. సీఎం పరకాల పర్యటనలో భాగంగా కొండా కుటుంబంతో చిరకాల శత్రుత్వం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ ప్రకటించి వారిని రెచ్చగొట్టారనే చర్చ నడుస్తున్నది. దీంతో రెచ్చిపోయిన కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత సీఎంపై, ఆయన సోదరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు. దీన్ని అడ్డుపెట్టుకొని కథ నడిపించిన ముఖ్యనేత చివరికి పదవి నుంచి తొలగించేలా చేశారు.
బర్తరఫ్ అయిన తొలి మహిళా మంత్రి
తెలుగు రాష్ర్టాల రాజకీయ చరిత్రలో బర్తరఫ్ అయిన తొలి మహిళా మంత్రి కొండా సురేఖ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు. పలు సందర్భాల్లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా మహిళ మంత్రులను పక్కన పెట్టడమో, రాజీనామా చేయించడమో జరిగింది. కానీ, ఇలా గవర్నర్ ఆమోదంతో తప్పించడం ఇదే తొలిసారిగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య ప్రభుత్వాల్లో మంత్రిగా చేసిన కొండా సురేఖకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆమె విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారనే చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన దుమారం చివరికి ఆమెను పదవి నుంచి తొలగించే వరకు రావడం గమనార్హం.
ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్.. ముదిరిన వివాదం
సురేఖ కుటుంబంపై పగ తీర్చుకొనేందుకు ముఖ్యనేత తీవ్రంగా ప్రయత్నించారని, ఇందుకు ఓఎస్డీ సుమంత్ వివాదాన్ని సైతం ఉపయోగించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఓఎస్డీని అడ్డుపెట్టుకొని సురేఖ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు యత్నించారనే ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కొండా కుటుంబం, సీఎం రేవంత్ మధ్య ఉన్న వివాదాన్ని ఓఎస్టీ సుమంత్ వ్యవహారం మరింత పెంచిందనే అభిప్రాయాలున్నాయి. ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను డబ్బుల కోసం బెదిరించారనే ఆరోపణలతో ఆయనను పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించింది. ఆయన సురేఖ నివాసంలోనే ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. ఇలా మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ సమయంలో కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పోలీసులు, ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులే టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. సుమంత్‌ను అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు.