హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బాలల న్యాయ చట్టం 2015తోపాటు పోక్సో చట్టాలను సమర్థంగా అమలు చేయాలంటే న్యాయవ్యవస్థ, పోలీస్, మహిళా-శిశు సంక్షేమం, విద్య, వైద్యారోగ్య విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ పిలుపునిచ్చారు. తెలంగాణ హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ, జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో ‘జువెనైల్ జస్టిస్-2015 పదేండ్ల అమలు, కార్యాచరణ’ ఆంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. బాలల భవిష్యత్తును సామాజిక బాధ్యతగా గుర్తించాలని కోరారు. తెలంగాణలో ఇప్పటికే 7,000 మందికి పైగా స్పాన్సర్షిప్ లబ్ధిదారులు ఉండటం మంచి పరిణామమని, గ్రామస్థాయి గుర్తింపు, డాక్యుమెంటేషన్, పర్యవేక్షణలను పటిష్టం చేసి ప్రతి బాలుడికి రక్షణ, గౌరవం, రెండో అవకాశం కల్పించే సమగ్ర వ్యవస్థను నిర్మించాలని పేరొన్నారు.
గ్రామస్థాయిలో పర్యవేక్షణ ఉండాలి
బాలలను అక్రమ రవాణా నుంచి రక్షించి పునరావాసం కల్పించడమే కాకుండా, అసలు ఆ ముప్పే తలెత్తకుండా గ్రామస్థాయి నుంచే ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని జస్టిస్ అపరేశ్‌కుమార్ నొకి చెప్పారు. ప్రతి గ్రామం, పంచాయతీ, బ్లాక్, జిల్లా స్థాయిలో పిల్లలకు సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉండే వ్యవస్థను రూపొందించాలని సూచించారు. జువెనైల్ జస్టిస్ పరిధిలోని సంరక్షణ గృహాలు కేవలం భోజనం పెట్టే కేంద్రాలుగా మిగిలిపోకూడదని, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం అందించే సంసరణ కేంద్రాలుగా మారాలని చెప్పారు. హైకోర్టు జడ్జి జస్టిస్ మౌషుమి భట్టాచార్య మాట్లాడుతూ జువెనైల్ జస్టిస్ చట్టం అమలులో బాలుడినే నిర్ణయ ప్రక్రియకు కేంద్ర బిందువుగా పరిగణించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. బాలలను నేరాలకు వాడుకుంటున్న పోకడలను అరికట్టాలని అన్నారు. ఆపరేషన్ ముసాన్ ద్వారా రక్షించిన పిల్లలు తిరిగి దోపిడీకి గురికాకుండా పర్యవేక్షించాలని చెప్పారు.