కవాడిగూడ, సెప్టెంబర్ 3: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన జీవో-97ను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. జీవో-97ను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, సీజేపీ సైత్ ఇండియా కోఆర్డినేటర్ విజయ్ముల్లంగి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్న్స హాజరై మద్దతు పలికారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. జీవో-97 ఉపసంహరించుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజులుగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీకి బదలాయించాలని కుట్రలు చేస్తున్నట్టు ఆరోపించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, కల్వ నితీష్, కల్వ గోపి, బళ్లేకారి రమేశ్, రాములు, విశాల్, జుగేంధర్, రాజశేఖర్‌గౌడ్, విద్యాసాగర్, హరీశ్‌యాదవ్, సాయి, చాణక్యరెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, కార్యదర్శి అశోక్‌రెడ్డి, అక్షయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.