చేగుంట, సెప్టెంబర్ 3: యూరియా దొరక్క ఓ మహిళా రైతు ఆవేదన చెందింది. అక్కడే ఉన్న అధికారి కాళ్లమీద పడి కంటతడి పెట్టింది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంటలో గురువారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. చేగుంటకు చెందిన మహిళా రైతు నర్సమ్మ గురువారం స్థానిక ఫర్టిలైజర్ దుకాణానికి చేరుకొని యూరియా ఇవ్వాలని కోరింది. యాప్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామని షాప్ యజమాని తెలుపడంతో ఆమెకు పాలుపోలేదు.
పక్కనే ఉన్న మండల వ్యవసాయ అధికారి కాళ్లమీద పడింది. ‘సార్.. నీ కాల్మొక్త యూరియా ఇప్పియ్యి’ అని వేడుకున్నది. అక్కడే ఉన్న చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళ్రావుతోపాటు ఏవో యూరియా ఇప్పించేలా కృషి చేస్తామని ఆమెకు సర్దిచెప్పారు. యూరియా యాప్ గురించి తనకు తెల్వదని అన్నారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఆటో అతనికి పైసలిస్తే ఇంటికే యూరియా బస్తాలు తెచ్చేటోడని నర్సవ్వ గుర్తుచేశారు.