కోరుట్ల, సెప్టెంబర్ 18: తెలంగాణను దేశం గర్వించేరీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో పట్టణ ప్రగతి నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.50 కోట్ల వ్యయంతో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో చేపట్టిన ఏకీకృత వెజ్ , నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు భూమిపూజ, రూ.53 లక్షలతో నిర్మించనున్న స్లాటర్ హౌస్ పనులకు శంకుస్థాపన, గడి బురుజు వద్ద రూ.5 లక్షలతో జాతీయ పతాకం కలరింగ్ సుందరీకరణ పనులు, రూ. 1.90 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం, కల్లూ రు రోడ్డులో రూ.50 లక్షలతో నిర్మించిన ఏకీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, రూ.25 లక్షలతో స్ట్రీట్ వెండర్ల కోసం నిర్మించిన దుకాణ సముదాయాలను ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో పట్టణాలు, గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. మున్సిపాలిటీల్లో ఆదాయంతో పనిలేకుండా నగర రూపురేఖలు, మౌలిక వసతుల కల్పన కోసం సీఎం కేసీఆర్ కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, ధర్మపురి పురపాలికలకు ప్రత్యేక నిధులు రూ.50 కోట్లు కేటాయించారని చెప్పారు.
రూ.10 కోట్లతో కోరుట్లలో మినీ ట్యాంకు బండ్, కూరగాయల మార్కెట్ ఆధునీకరణ, వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణపై విషం చిమ్మే ప్రయత్నం జరుగుతున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని చిన్నాభిన్నం చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును సచివాలయానికి పెట్టడం హర్షించదగిన విషయమని, మంచి విషయాన్ని కూడా బండి సంజయ్ లాంటి వ్యక్తులు రాజకీయాలు చేయడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిధుల కోసం చేస్తున్నావా?, నీళ్ల కోసం చేస్తున్నవా?, ఎస్సీల కోసమా?, తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నవా? చెప్పాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్ల సుదీర్ఘ భారత చరిత్రలో ఇంత నీచమైన రాజకీయం చూడలేదని, దేశాన్ని ప్రైవేట్‌పరం చేయడమే కేంద్ర సర్కార్ లక్ష్యంగా కనిపిస్తున్నదన్నారు. బండి సంజయ్ చేష్టలు చూస్తుంటే చిన్న పిల్లాడి మనస్తత్వం గుర్తుకు వస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని ఎమ్మెల్సీ రమణ పేర్కొన్నారు. రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచాలంటే సీఎంతోనే సాధ్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కోరుట్ల మున్సిపాలిటీకి కేటాయించిన రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో పట్టణ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నా రు. అనంతరం పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడతామని ప్రకటించిన నేపథ్యంలో దళిత సంఘాల నేతలు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ గుగులోతు రవి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు, ఎంపీపీ తోట నారాయణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, తహసీల్దార్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.