హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 18: తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఇందులో భాగంగా మేదరి కులస్తుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేదర్ చౌరస్తా వద్ద ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని హుజూరాబాద్ మండల మేదరి (మహేంద్ర) సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మేదరి సంఘం భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని, వెదురు మొకల పెంపకానికి ఐదెకరాల భూమి ఇవ్వాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మంజూరుకు తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మేదరి సంఘం హుజూరాబాద్ అధ్యక్షుడు చింతల సతీశ్, ప్రధాన కార్యదర్శి రాపాల రాజమౌళి, కోశాధికారి మొలుగూరి భిక్షపతి, ప్రచార కార్యదర్శి ప్రతాపగిరి వెంకటేశ్వర్లు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వీణవంక, సెప్టెంబర్ 18: మండల కేంద్రంలో ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మండల మేదరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు కేక్‌కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు. దానికి బదులు వెదురుతో చేసిన వస్తువుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య, మేదరి సంఘం మండలాధ్యక్షుడు కూచనపల్లి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు రాకేశ్, సభ్యులు వెంకటేశ్, రాజమౌళి, సాంబయ్య, గణేశ్, సారయ్య, రాజయ్య, రాజు, శివ, దీపిక, శ్రీదేవి, సాలమ్మ, సారమ్మ, బన్నీ, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.