కొత్తపల్లి, సెప్టెంబర్ 10: మహాత్మాజ్యోతిరావుఫూలే గురుకులాల్లో సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా బోధన అందిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌స్టేడియంలో శనివారం రాత్రి మహాత్మా జ్యోతిరావుఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కరీంనగర్ ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గురుకులాలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవడం అభినందనీయయమని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్తగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి గురుకులంలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదన్నారు. తాము చదువుకున్న సందర్భంలో ఇంతలా సౌకర్యాలు చూడలేదని, గతంలో చాలా మంది చదువుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా సాధ్యంకాలేదన్నారు.
రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం తెలంగాణలో 53 శాతం బీసీలకు చెందిన 16వేల మంది పిల్లలకు కేవలం 9 గురుకులాలు మాత్రమే విద్యనందించేవని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 281 బీసీ గురుకులాలలను ఏర్పాటు చేసి లక్షా 51వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షా25వేలు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. బీసీ బిడ్డలకు సేవలందించేందుకే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి గురుకులంలో విద్యార్థులు వేడి నీటితో స్నానం చేసేందుకు వీలుగా గీజర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోనే రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గురుకులాల్లో మెరుగైన విద్య: ఎమ్మెల్యే రసమయి
ఇప్పుడు గురుకులాల్లో అందుతున్న సౌకర్యాల్లో సగమైనా తాము చదువుకున్నప్పుడు ఉంటే మరింత ఉన్నతస్థాయికి ఎదిగేవాళ్లమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభిప్రాయపడ్డారు. గతంలో గురుకులాల్లో తమ పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఉండేవని, సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో మెరుగైన విద్య అందుతున్నదని, నేడు గురుకులా ల్లో సీట్ల కోసం పైరవీలు చేయించే స్థాయికి అభివృద్ధి చెందాయన్నారు. గెలుపోటములు మనిషికి రెండు కాళ్లలాంటివని, ఓడిపోయిన వారందరూ నిరాశ చెందకుండా కొత్త విషయాలను తెలుసుకొని గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు.
కార్పొరేట్‌కు దీటుగా విద్యాలయాలు: ఎమ్మెల్యే సుంకె
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే గురుకులాలు సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా మారాయని, ఇదంతా కేసీఆర్ కృషితోనే సాధ్యమైందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, అధ్యాపకులు నృత్యం చేస్తూ ఉత్తేజం నింపారు. కాగా, పోటీల్లో బాలికల విభాగంలో వేములవాడ బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోగా, బాలుర విభాగంలో సైదాపూర్ బీసీ గురుకుల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గెలుపొందారు.
అథ్లెటిక్స్‌తో పాటు క్యారమ్స్, చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇక్కడ విజయం సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనుండగా, అక్కడ గెలిచినవారు ఇంటర్ సొసైటీ లీగ్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో కే రాజవీరు, ఆర్సీవో గౌతంరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు, ప్రిన్సిపాల్స్ వీ రాఘవరెడ్డి, మధుసూదన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి కనకం సమ్మయ్య, పెటా టీఎస్ అధ్యక్షుడు అంతడుపుల శ్రీనివాస్ పాల్గొన్నారు.