కరీంనగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాసంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి రాష్ర్టానికి మార్గనిర్దేశం చేస్తూ ఆలోచింపజేస్తున్నాయి. రాష్ట్రంలోని నిరుపేదల జీవితాలకు భరోసా కల్పిస్తూనే వారి ఆకలిని తీర్చుతున్నాయి. ఇలా ప్రతి వర్గం కడుపునింపేలా సరికొత్త స్కీంలకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర సర్కారు, ‘ఆసరా’ పింఛన్లతో అభాగ్యులకు అండగా నిలిచింది. తాజాగా, ఈ పథకంలో 57 ఏండ్లు నిండిన వారిని సైతం చేర్చగా, కొత్త పింఛన్ల పంపిణీతో ఊరూరా పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 4,21,351 మంది లబ్ధి పొందుతుండగా, కొత్తగా మరో 1,08,318 మందిని అర్హులుగా గుర్తించి మంజూరు పత్రాలు అందిస్తుండడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కొత్త పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 57ఏండ్లు నిండిన వారికి అధికారులు మంజూరు పత్రాలు అందిస్తుండడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వయసు తగ్గించి పెన్షన్ ఇస్తుండడంతో ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఊరూరికి వెళ్లి పెన్షన్ మంజూరు పత్రాలు అందిస్తున్నారు. దీంతో ఇపుడు ఎక్కడ చూసినా ఆసరా పెన్షన్ల గురించిన సంబురాలే కనిపిస్తున్నాయి.
ఇంటింటికీ పెద్ద కొడుకై..
సీఎం కేసీఆర్ ఆసరా పథకం కింద నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నారు. ఆసరా పెన్షన్ అందే ప్రతి ఇంటికీ పెద్ద కొడుకై నిలుస్తున్నారు. గతంలో సాంఘిక భద్రత పెన్షన్ కింద ఇచ్చిన ఈ పథకం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా స్వరూపం మారిపోయింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ. 3,016 చొప్పున, ఇతర లబ్ధిదారులకు రూ.2,016 చొప్పున పెంచి దిక్కులేని లక్షలాది కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే ఆసరా పెన్షన్ పొందాలంటే కనీస వయసు 60 ఏండ్లు ఉండాలనే నిబంధనను సీఎం కేసీఆర్ మార్చేశారు. 57 ఏండ్లు నిండితే చాలు ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి గత ఆగస్టు నుంచే శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు 57 ఏండ్లు ఉన్న వారిని గుర్తించి గత నెల నుంచి పెన్షన్ అందిస్తున్నారు. ఈ రకంగా ఉమ్మడి జిల్లాలో కొత్తగా 1,08,318 మందికి ఆసరా పింఛన్ మంజూరు పత్రాలు అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే 4,21,351 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తవి చేర్చడంతో లబ్ధిదారుల సంఖ్య 5,29,669 మందికి చేరుతున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కొత్తగా 31,822 మందికి ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలు అందిస్తున్నారు. ఈ జిల్లాలో ఇప్పటికే 1,15,995 మంది లబ్ధిదారులు ఉండగా కొత్తవారిని జత చేస్తే మొత్తం 1,47,817 లబ్ధిదారుల సంఖ్య మందికి చేరింది.
పండుగలా పంపిణీ..
57 ఏండ్లకే ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గమైన కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్ నగరంతోపాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి గంగుల కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. పొద్దు పొడుపు కార్యక్రమంతో ప్రతి రోజు గ్రామాల్లోనే ఉండే మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు.
మానకొండూర్, తిమ్మాపూర్ మండలాలు ఇప్పటికే పూర్తికాగా శనివారం గన్నేరువరం మండలంలో పెద్ద ఎత్తున పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇక చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా తన నియోజకవర్గంలోని గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనేక గ్రామాల్లో నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ మంజూరు పత్రాలు అందిస్తున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్ చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని పత్రాలు అందించారు.
జగిత్యాల జిల్లాలోని తన నియోజకవర్గం ధర్మపురిలో మంత్రికొప్పుల ఈశ్వర్, జగిత్యాలలో ఎమెల్యే సంజయ్‌కుమార్, కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండంలో కోరుకంటి చందర్ అందిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను ప్రతి రోజూ పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..