రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) :బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపక్రమించింది. సాధారణ ఎన్నికల నాటికి తప్పుల్లేని తుది జాబితా రూపొందించాలని సంకల్పించింది. ఈ దిశగా ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఆగస్టు ఒకటి నుంచి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 537 బృందాలతో చేపట్టిన ఇంటింటా సర్వే చకచకా సాగుతున్నది. ఇప్పటికే 39 శాతం పూర్తికాగా రాష్ట్రంలో ఈ జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. అక్టోబర్ ఆఖరు నాటికి ఆధార్ సీడింగ్‌ను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నది.
బోగస్ ఓట్లు ప్రజాతీర్పుపై ఫలితం చూపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఓటరు జాబితాను తయారు చేయాలని సంకల్పించింది. ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానించాలని నకిలీ ఓట్లను ఏరివేయాలని నిర్ణయించింది. ఈ దిశగా ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ 31 వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో భాగంగా రాజన్నసిరిసిల్లలో 537 మంది అంగన్వాడీ టీచర్లు, 537 మంది సమైక్య సంఘాల సభ్యులతో 537 బృందాలను నియమించింది. వీరు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాల పరిధిలో గడపగడపకూ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 39 శాతం పూర్తి కాగా, రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది.
పకడ్బందీగా ప్రక్రియ.
జిల్లా వ్యాప్తంగా ఆధార్ అనుసంధాన ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నది. సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంసభ్యుల వివరాలు సేకరిస్తున్నాయి. రెండేసి ఓటరు కార్డులున్న వారిని గుర్తించి తొలగిస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు మరణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
మూడు నెలల్లో పూర్తి
జిల్లాలో చేపట్టిన సర్వేను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,32,652 మంది ఓటర్లుండగా పురుషులు 2,10,917, మహిళలు 2,21,733, ట్రాన్స్జెండర్లు ఇద్దరు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పురుషులు 1.11,504 మంది ఉండగా, మహిళలు 115441 మంది ఉన్నా రు. వీరి కోసం 282 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వేములవాడలో పురుషులు 99413 మంది, మహిళలు 1,06,292 మంది ఉండ గా, 255 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాగా, పాత జాబితాలో 4,36,905 మంది ఓటర్లు ఉండగా, 4253 మంది ఓటర్లను తొలగించారు. ఇప్పటివరకు 1400 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. సారథి కళాబృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆధార్ సీడింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
యాప్‌ల్లో నిక్షిప్తం
మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో జిల్లాలో ఆధార్ సీడింగ్ సర్వే వేగంగా సాగుతున్నది. బూత్‌లెవెల్ ఆఫీసర్లు సర్వే చేసి ఓటు నమోదు, ఆధార్ లింకేజీ (గరుడ), స్వయంగా ఓటరు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం (ఎన్వీఎస్పీ), ఓటర్ హెల్ప్ లాంటి యాప్‌లలో నమోదు చేయడంలో జిల్లా ఆరో ర్యాంకు సాధించింది. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల నివాసాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.12 లక్షలు, సిరిసిల్ల మున్సిపాలిటీలో 28 వేలు, వేములవాడ మున్సిపాలిటీలో 14 వేల నివాసాలు ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేసే ప్రక్రియను గడువుకన్నా ముందే ముగించే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నది.