జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 4: స్వరాష్ట్రంలోనే జగిత్యాల పట్టణ ప్రగతి జరుగుతున్నదని, కోట్లాది నిధులతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని 17వార్డులకు చెందిన 758 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు కార్డులను మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాలపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని, కోట్లాది నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. రూ.4.20కోట్లతో సమీకృత మారెట్ను నిర్మిస్తున్నామని, రూ.17 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు చేశామని, ఇంకా అనేక పనులు చేసుకున్నామని వివరించారు. జగిత్యాల నడి బొడ్డున మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుని, చుట్టూ ప్రధాన రహదారుల కోసం రూ.10 కోట్లు మంజూరయ్యాయని, పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇంకా విద్యా, వైద్యంపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. వృద్ధాప్యంలో పేద, మధ్య తరగతివారు ఇబ్బందులు పడవద్దనే 57 ఏండ్ల వయస్సుకే పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అర్హుల్లో ఎవరికైనా పింఛన్లు రాకపోతే త్వరలోనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ డీఈ రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఎంఐఎం అధ్యక్షుడు నదేమ్, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.