కలెక్టరేట్, మార్చి 12: జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కొనియాడారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండో డోసు వందశాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ విజయవంతానికి కృషి చేసిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సహకరించిన జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులను అభినందించారు. కరోనాతో ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చేరిన వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
ఆక్సిజన్‌కు ఇబ్బందులు తలెత్తకుండా రెండు ప్లాంట్లు నెలకొల్పినట్లు వెల్లడించారు. అలాగే, నగరంలో స్మార్ట్‌సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రభుత్వ పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులంతా సమష్టిగా కృషి చేద్దామన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన నిధులు తెస్తానని, పథకాల అమలును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. అనంతరం వివిధ శాఖల్లో సంక్షేమ పథకాల అమలు తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు మరో ఇద్దరు దిశ కమిటీ సభ్యులు వర్చువల్ పద్ధతిలోనే సమావేశానికి హాజరయ్యారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, డీఆర్డీవో శ్రీలత, జడ్పీ డిప్యూటీ సీఈవో పవన్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, డీఎంహెచ్‌వో డా. జువేరియా, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, డీఈవో జనార్దన్‌రావు, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, పరిశ్రమల శాఖ జీఎం నవీన్, పశు సంవర్ధక శాఖ అధికారి నరేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.