కరీంనగర్ రూరల్: మార్చి 12: వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపివేసిన గ్రామీణ యువతులు, మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉచిత కుట్టుశిక్షణను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామంలో నివేద స్కిల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్చార్జి స్వప్న పర్యవేక్షణలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా డిజైనింగ్, ఎంబ్రాయిడరీలోనూ తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి గ్రామ నాయకుడు బాషవేణి మల్లేశ్ యాదవ్ తోడ్పాటునందిస్తున్నారు. శిక్షణ కార్యక్రమ నిర్వహణ కోసం ఆయన రూ.35 వేలు అందించగా, సర్పంచ్ సామగ్రిని సమకూర్చి గ్రామంలోని నిరుపేద మహిళలను ప్రోత్సహించారు. దీంతో ఇప్పటి దాకా 26 మంది ఇక్కడ శిక్షణ పొందగా, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫౌండేషన్ నిర్వాహకులు కృషి చేస్తున్నారు.