కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 1: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని, అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. గురువారం కోరుట్ల మండలం అయిలాపూర్ ముదిరాజ్ కల్యాణ మండపంలో అయిలాపూర్, తిమ్మాయిపల్లి, కల్లూరు, ధర్మారం, యూసుఫ్‌నగర్ గ్రామాల లబ్ధిదారులకు, పైడిమడుగులో అమ్మవారి మర్రి కల్యాణ మండపంలో పైడిమడుగు, మాదాపూర్, జోగిన్‌పల్లి, చిన్నమెట్పల్లి, సర్పరాజ్‌పూర్ గ్రామాల్లోని లబ్ధిదారులకు, మోహన్రావుపేటలోని కల్యాణ మండపంలో మోహన్‌రావుపేట, వెంకటాపూర్, గుంలాపూర్, నాగులపేట, సంగెం 15 గ్రామాల్లో 1488 లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడారు.
ఏ ధీమా లేని అభాగ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి అండగా నిలుస్తున్నారని, పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే నిలబెట్టుకున్నారని చెప్పారు. వృద్ధులకు ఇచ్చే పింఛన్ కోసం వయస్సును 57ఏండ్లకు తగ్గించి సాహాసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని అమల్లోకి తెచ్చారని కొనియాడారు. ‘కొత్తబిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి నీచ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని, అభివృద్ధిని ఓర్వలేక ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారు గ్రామాల్లోకి వస్తే ప్రజలు, మహిళలు, నిలదీయాలన్నారు. ప్రజల్లో ఉండే నాయకున్ని ఎన్నుకోవాలే తప్పా, ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే నాయకులను నమ్మవద్దన్నారు.
ధర్మారంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి ఆమె సేవలను కొనియాడారు. కాగా, తిమ్మాయపల్లి, మాదాపూర్, వెంకటాపూర్, గుంలాపూర్ గ్రామాల్లో వివిధ కుల సంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు పత్రాలతో పాటు సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తోట నారాయణ, జెడ్పీటీసీలు దారిశెట్టి లావణ్య, సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ చీటి స్వరూప, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు, జిల్లా ప్రాథమిక సహాకార సంఘం ఫోరం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నర్సారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతకుంట సంజీవరెడ్డి, డీఆర్డీఏ పీడీ వినోద్, ఇంచార్జీ ఎంపీడీవో నీరజ, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖయ్యూం, మండల టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా గ్రంథాల మాజీ డైరెక్టర్ గుగ్గిల్ల సురేష్‌గౌడ్ ఉన్నారు.