గణేశ్ నవరాత్రోత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య ప్రతిమలు బుధవారం తొలిపూజలందుకున్నాయి.. రెండో రోజు గురువారం కూడా భక్తులు బారులు తీరడంతో ఎక్కడ చూసినా సందడి కనిపించగా, పలుచోట్ల ప్రతిష్ఠించిన వెరైటీ వినాయకులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 1: తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకోనున్న గణనాథుడు బుధవారం కొలువుదీరాడు. వాడవాడనా అందంగా ముస్తాబు చేసిన మండపాల్లో బుధవారంతోపాటు గురువారం ఘనమైన పూజలందుకున్నాడు. ఈ సారి ఎక్కువగా మట్టి గణపతులను ప్రతిష్ఠించగా, అందులోనూ విభిన్నంగా దర్శనమిచ్చాడు. ఓ చోట కుండలతో.. మరోచోట గడ్డితో.. ఇంకోచోట మట్టితో వివిధ రూపాల్లో కనువిందు చేశాడు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో.. కృష్ణానగర్‌లో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుల వద్ద ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రాధిక దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిఖని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు చేశారు.
వినాయకుడి కృపతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే దేశ సంక్షేమమని, ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. బుధవారం ఆయన కరీంనగర్‌లోని ప్రకాశ్గంజ్, టవర్ సర్కిల్, రాంనగర్, కిసాన్‌నగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, శ్యాంప్రసాద్‌లాల్, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, మేయర్ సునీల్ రావుతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. టవర్ సర్కిల్ గణనాథుడు 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. రాంనగర్లో భారీ మట్టి గణపతిని చూసి ఏర్పాటు చేసిన మిత్ర యూత్‌ను అభినందించారు.