జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని గుల్లకోటలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న చందూరి రాజిరెడ్డి ఎంపికయ్యారు. గతంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఎంపీపీఎస్ కురిక్యాలలో విధులు నిర్వహిస్తున్నప్పుడు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయుడిగా ఎంపికయ్యారు. ఇతను గతంలో విద్యాభివృద్ధికి నిధుల సేకరణ, కరోనా కాలంలోనూ సేవా కార్యక్రమాలు చేయడం, ఇందులో విద్యార్థులను భాగస్వాములను చేయడం వంటివి ఉపాధ్యాయులతో కలిసి కృషి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం చకినాల శ్రీనివాస్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఇతను విద్యార్థుల సంఖ్య పెరుగుదల, మౌలిక సదుపాయాల రూపకల్పన, నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని జడ్పీ సెకండరీ పాఠశాల(స్కూల్ అసిస్టెంట్, గణిత శాస్త్రం)లో విధులు నిర్వర్తిస్తున్న అంబటి శంకర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తిర్మలాపూర్ (మల్లన్నపేట) జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బూస జమునాదేవి రాష్ట్ర స్థాయి బెస్ట్ జీహెచ్ఎం (గర్ల్స్ కేటగిరీ)లో ఎంపికయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలను గుర్తించి ఎంపిక చేశారు. మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థిని దత్తత తీసుకుని.. ఉన్నతంగా తీర్చిదిద్ది
కరీంనగర్‌రూరల్ మండలంలోని నగునూర్ జడ్పీ ఉన్నత పాఠశాల బయోలాజికల్ స్కూల్ అసిస్టెంట్ కన్న అరుణ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పేద విద్యార్థి వెంకటేశ్వర్లును దత్తత తీసుకుని, ఉత్తమంగా తీర్చిదిద్ది, బాసర త్రిపుఐటీలో సీటు సంపాదించేలా కృషి చేశారు. అంతేకాకుండా హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడమే కాకుండా, అవగాహన కల్పించారు. ప్రత్యేక గార్డెన్ ఏర్పాటు చేయించారు.
ఇంటింటికీ వెళ్లి బోధించిన ఫలితం
కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు వింటూ అర్థంకాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి, తానే స్వయంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠాలు చెప్పినందుకు పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధి చందపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కర్రె ప్రవీణ్‌కుమార్‌కు గుర్తింపు దక్కింది. పాఠశాలలో పారిశుధ్య చర్యలు చేపడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూస్తున్న ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఈ పాఠశాలలో 2015లో బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ 60 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను 130కి పెంచారు. 2021-22 విద్యాసంవత్సరానికి జిల్లా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ను ఇటీవల పెద్దపల్లి కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.