కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ చివరి దశకు వచ్చింది. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని క్రాప్ బుకింగ్ పేరుతో రూపొందిన మొబైల్ యాప్ సహాయంతో ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. పంటల సాగు నమోదు పక్కాగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వానకాలం సీజన్లో ఇప్పటి వరకు 94.04 శాతం పంటల నమోదు పూర్తయిందని, మిగతావి రెండుమూడు రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ స్పష్టం చేశారు.
కరీంనగర్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ): పంటల సాగు వివరాల నమోదులో తప్పులు ఉండడం వల్ల పైర్లకు సోకుతున్న తెగుళ్లను సకాలంలో గుర్తించకపోవడం, పంటల కొనుగోళ్లలో అంచనాలు తప్పి ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంటల నమోదును పక్కాగా నిర్వహించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఈ ప్రక్రియ ప్రతి సీజన్లో నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి నుంచి వ్యవసాయ విస్తరణ అధికారుల వరకు సర్వే నిర్వహించేందుకు క్రాప్ బుకింగ్ పేరుతో మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ల వారీగా పర్యటించే విధంగా పంటలకు జియో ట్యాగింగ్ చేశారు. దీంతో ఆయా సర్వే నంబర్ లొకేషన్‌కు వెళ్లి ఫొటోతీస్తే తప్ప మొబైల్ యాప్ ఓపెన్ కాదు. అంతే కాకుండా ఏ అధికారి ఏ గ్రామంలో ఏ రోజు ఏ సర్వే నంబర్లో పంటలు నమోదు చేశారనేది పక్కాగా మొబైల్ యాప్‌లో రికార్డు అవుతుంది.
వ్యవసాయ విస్తరణ అధికారులు ఇంటి వద్దనో, తమ ఆఫీసులోనో ఉండి పంటలు నమోదు చేయాలనుకుంటే ఈ యాప్ ఓపెనయ్యే ప్రసక్తే ఉండదు. తమ క్లష్టర్ పరిధిలోని రైతు వేదికలోనే ఈ యాప్ ఓపెనయ్యేలా రూపొందించారు. అక్కడి నుంచి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు నిత్యం పరిశీలిస్తుంటారు. అంతే కాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేసిన పంటల వివరాలు ర్యాండమ్‌గా పరిశీలించేందు కు జిల్లా, డివిజన్, మండల వ్యవసాయ అధికారులకు వారానికి 20 సర్వే నంబర్లు కేటాయిస్తున్నారు.
ప్రతి ఆదివారం కేటాయిస్తున్న ఈ సర్వే నంబర్లను శనివారంలోగా పరిశీలించి ఈ అధికారులు అప్లోడ్ చేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారులు చేసిన నమోదులో ఏవైనా తేడాలు ఉంటే వెంటనే రిమార్క్‌లు ఇస్తున్నారు. తప్పు డు నమోదు చేసిన వ్యవసాయ విస్తరణ అధికారులపై ఈసారి చర్యలు ఉంటాయని కమిషనరే ట్ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా లో పంటల నమోదు పక్కాగా జరుగుతోంది.
జిల్లాలో 94.04 శాతం నమోదు
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 94.04 శాతం పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. నిజానికి ఈ నమోదు కార్యక్రమాన్ని జూన్ రైతులు పంటల సాగు మొదలైన సమయంలోనే ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ, ఈసారి మొబైల్ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించేందుకు కమిషనరేట్ అధికారులకు సమయం పట్టింది. జూలైలో పంటల నమోదు ప్రారంభించిన వ్యవసాయ విస్తరణ అధికారులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 76 వ్యవసాయ క్లష్టర్ల పరిధిలో ఈ వానకాలంలో 5,57,447 రైతుల కమతాల్లోని 3,62,474 ఎకరాల్లో పంటలు సాగు చేయగా 4,52,800 కమతాల్లోని 3,15,672 ఎకరాల్లో పంటలు నమోదు చేశారు. ఇంకా 1,04,647 కమతాల్లో 46,802 ఎకరాల్లో మాత్రమే పంటలు నమోదు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏఈవోలు చేసిన పంటల నమోదు ప్రకారం జిల్లాలో పత్తి46,905.13 ఎకరాల్లో, వరి 2,62,05.38 ఎకరాల్లో, 807.10 ఎకరాల్లో కంది, 3,487. 06 ఎకరాల్లో మక్క, 49.16 ఎకరాల్లో జొన్న, 85.26 ఎకరాల్లో పెసర, 51.10 ఎకరాల్లో పల్లి ప్రధాన పంటలుగా, మిగతా ఎకరాల్లో ఇతర పంటలు నమోదు అయ్యాయి.
రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తాం
జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ పూర్తి కావస్తోంది. మా వ్యవసాయ విస్తరణ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో పర్యటించి శరవేగంగా పక్కాగా పంటల నమోదు చేస్తున్నారు. నాతోపా ఏడీఏలు, ఎంఏవోలమంతా ర్యాండమ్‌గా పరిశీలిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో 94.04 శాతం పూర్తయింది. ఈసారి క్రాప్ బుకింగ్ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఫీల్డ్‌కు వెళ్తేగానీ ఈ యాప్ ఓపెన్ కాదు. ప్రతి సర్వే నంబర్‌ను జియో ట్యాగింగ్ చేశారు. అక్కడ ఉండి ఓపెన్ చేస్తేనే యాప్ ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారనేది క్షేత్ర స్థాయిలో వెళ్లి నమోదు చేయక తప్పదు. ఇంత పక్కాగా చేపడుతున్నా జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి రోజు వారి క్లస్టర్‌లోనే ఉండి పంటలు నమోదు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన పంటలు కూడా నమోదు చేస్తాం.
– వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా వ్యవసాయాధికారి, కరీంనగర్