శంకరపట్నం/వీణవంక, సెప్టెంబర్ 1: పంచాయతీ శాఖలో అలజడి రేగింది. ఓ క్వారీ నిర్వాహకుడికి గ్రానైట్ క్వారీ ఫోర్బుల్ బాక్స్ అనుమతులకు ఆముదాలపల్లి పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేశాడు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో రూ.10వేలు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన వీరమనేని కిషన్‌రావు శంకరపట్నం మండలం ఆముదాలపల్లి శివారులో మణికంఠ గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నాడు.
కాగా గ్రానైట్ క్వారీలో ఫోర్టబుల్ బాక్స్ అనుమతుల కోసం జూన్ 6, 2021న జిల్లా సీపీకి ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జూలై 21న కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఆర్డీఓకు ఒక కాపీని, అలాగే మరో ప్రతిని ఆముదాలపల్లి జీపీకి పంపించారు. ఇక్కడ జీపీ నుంచి ఎన్ఓసీ కోసం క్వారీ నిర్వాహకుడు కిషన్‌రావు పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డిని కలిశాడు. ఈ క్రమంలో కిషన్‌రావును రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని వేధించాడు.
దీంతో కిషన్‌రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అప్పటి నుంచి సత్యనారాయణరెడ్డిపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. కాగా, గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కిషన్‌రావు నుంచి సత్యనారాయణరెడ్డి రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచనామా నిర్వహించారు. అదే సమయంలో నిందితుడి స్వగ్రామం వీణవంక మండలం అచ్చంపల్లిలోని నివాసంలో సోదాలు నిర్వహించారు. సత్యనారాయణరెడ్డిని శుక్రవారం కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్‌లో ఏసీబీ సీఐలు తిరుపతి, రవీందర్, రామ్, జాన్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.