కరీంనగర్ రూరల్/ధర్మారం, ఆగస్టు 27: ఏ ధీమాలేని అభాగ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ అండగా నిలుస్తున్నారు. స్వరాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదేళ్లలో పింఛన్లను రెండు సార్లు పెంచారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లను 200 నుంచి 2016, దివ్యాంగుల పింఛన్లను 500 నుంచి 3016 లకు పెంచారు. రెండో సారి పెరిగిన పింఛన్లను 2019 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు. తర్వాత మరోసారి సాహసోసేత నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులకు ఇచ్చే పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకుకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కరోనాతో కాస్త ఆలస్యమైనా ఇచ్చిన మాటను నిలుపుకొన్నారు. వజ్రోత్సవాల కానుకగా అర్హత ఉన్నోళ్లందరికీ ఆగస్టు 15న కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలో 1,08,318 మందికి మంజూరు చేశారు. పంద్రాగస్టు నుంచే అర్హులకు ఆసరా మంజూరు పత్రాలు, కార్డులు అందిస్తున్నారు. శనివారం ధర్మారం మండలం నందిమేడారంలో 196 మందికి మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో 596 మందికి మంత్రి గంగుల కమ లాకర్ పంపిణీ చేయగా, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పింఛన్లతో ఆదరణ కరువైన వారికి, ఒంటరి వారికి భరోసా దొరుకుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు పింఛన్లిచ్చి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు చెబుతున్నారు.
కొండంత ధైర్యమచ్చింది
నాకు ఇద్దరు కొడుకులు. ఇల్లు తప్ప ఏమీ లేదు. నా భర్త సమ్మయ్య మూడేండ్ల కిందనే చనిపోయిండు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న. నేను కూలి చేస్తేనే ఇంటిలో అందరికీ అన్నం దొరుకుతది. కూలీకి పోని రోజు పస్తులుండుడె. ఎన్కా ముందు ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ సార్ పింఛన్ మంజూరు చేసిండు. మా ఊరికి వచ్చి మంత్రి ఈశ్వర్ సారు పత్రం ఇచ్చిండు. ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆనందంగా ఉంది
– మేరుగుత్తుల లక్ష్మి,లబ్ధిదారురాలు (నంది మేడారం)
సల్లంగుండాలె
నాకు భర్త చానా రోజుల కిందనే చనిపోయిండు. ఉన్న ఒక్క బిడ్డకు పెండ్లి చేసి పంపినం. నేను ఒక్కదాన్నే ఉంట. కూలీ పనిజేస్తేనే ఇల్లు గడుస్తంది. ఊళ్లేనే దొరికిన పని చేసుకుంట బతుకుతున్న. పని లేకపోతే కడుపు మాడ్సుకుండుడే. ఈ మధ్యల అసలు పనే దొరుకుతలేదు. కొత్తగా పింఛన్లు ఇస్తున్నరంటే దరఖాస్తు చేసుకున్న. కొత్త పింఛన్లతోని నాకు అచ్చింది. ఇయ్యాలనే కమలాకర్ సారు నాకు మంజూరు కార్డును ఇచ్చిండు. వచ్చే నెల నుంచి ప్రతి నెలా నాకు రూ.2,016 వస్తయట. ఇక నాకు రంది లేదు. మాసోంటోళ్ల బతుకుల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్ సారు దేవుడు. ఎల్లకాలం చల్లంగ ఉండాలె.
తిండిమందం అయితయి..
నాకు ఇద్దరు కొడుకులు. ఒకడు యాక్సిడెంట్ల చచ్చిపోయిండు. ఉన్న ఒక్కడు ఊళ్లే చిన్న దుకాణం పెట్టుకున్నడు. ఎల్లినకాడికి బతుకుతండు. వానికి నేను భారం కావద్దని అనుకున్న. గప్పుడే కేసీఆర్ సారు సల్లటికబురు చెప్పిండు. 57ఏండ్లోళ్లకు పింఛిని ఇత్తమని అన్నడు. చానా సంబురమైంది. అధికారులను కలిసి దరఖాస్తు చేసిన. ఇయ్యాలనే మంత్రి గంగు సారు కార్డు ఇచ్చిండు. వచ్చే నెల నుంచి పైసలు అస్తయట. తిండిమందం అయితయి. చానా సంతోషంగ ఉంది.
– బుర్ర నర్సవ్వ, లబ్ధిదారురాలు (దుర్శేడ్)