కరీంనగర్ రూరల్, ఆగస్టు 27: రాష్ట్రంలో పచ్చని పంటలు కావాలా..? మత ఘర్షణలు కావాలా..? ఏది కావాలో మనమే ఆలోచించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ పార్టీలనీ, అలాంటి పార్టీలు మనకు అవసరమా..? అని ప్రశ్నించారు. మనలాంటి ఒక్క పథకమైనా వారి పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా..? అడిగారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వడం లేదని, ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా అనవసర విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. అలాంటి వారిని నమ్మొద్దని, అన్నం పెట్టిన సీఎం కేసీఆర్‌ను మరువద్దని సూచించారు. స్వరాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేస్తున్నారని కొనియాడారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లోని టీవీ గార్డెన్లో శనివారం బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలకు చెందిన 596 మంది కొత్త పింఛన్ లబ్ధిదారులకు ఆసరా మంజూరు పత్రాలు, ఐడీ కార్డులు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు కొత్తకొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని, షర్మిల పాదయాత్ర ఎటువైపు పోతుందో ఆమెకే అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు. నాటి సమైక్య పాలనలో 200 పెన్షన్ ఇచ్చేవారని, స్వరాష్ట్రంలో 2,016 అందిస్తున్నామని, దివ్యాంగులకైతే 3016 ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మంజూరు పత్రాలు, ఐడీ కార్డులు ఇస్తున్నామని, వచ్చే నెల నుంచి మీ మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 1.15లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, కొత్తగా మరో 31,822 మందికి ఇస్తున్నామని వివరించారు. స్వరాష్ట్రంలో గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కాగా, కరీంనగర్ మండలం బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్‌లో ఇదివరకు 1226లో లబ్ధిదారులు ఉండగా, కొత్తగా 596 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
వీరందరికీ వచ్చే సెప్టెంబర్ నుంచి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమవుతా యని వివరించారు. కొత్తపల్లి మండలంలో ఇది వరకు 3664 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తగా 982 మందికి అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, ఎంపీటీసీలు వెంగళదాసు శ్రీనివాస్, వేల్పుల నారాయణ, ర్యాకం లక్ష్మి, డీఆర్డీవో శ్రీలత, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు, సర్పంచ్‌లు ఊరడి మంజుల, గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్లు సుంకిశాల సంపత్‌రావు, కరీంనగర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బీరం అంజనేయుబ, ఆరె శ్రీకాంత్, రాములు, ఐలయ్య, ర్యాకం మోహన్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో సంపత్‌కుమార్, సంతోష్ పాల్గొన్నారు.
ఊళ్లెనే మంజూరు పత్రం తీసుకున్న
నాకు ముగ్గురు కూతుర్లు. ఇల్లు తప్ప ఆస్తిపాస్తులేం లేవు. నా భర్త నర్సింహాచారి మూడేండ్ల కింద ఆక్సిడెంట్లో చనిపోయిండు. పెద్ద దిక్కును కోల్పోయిన. కుటుంబ పోషణ భారమైంది. అప్పో సప్పో చేసి కూతుళ్ల పెండ్లి చేసిన. ఇంకా చిన్న కూతురు ఉంది. మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న. ఇప్పుడు నాకు ఆసరా పింఛన్ మంజూరైంది. నెల నెలా కుటుంబ అవసరాల కోసం పింఛన్ ఉపయోగపడుతుంది. ఈ రోజు మా ఊళ్లె పింఛన్ మంజూరు పత్రం తీసుకున్న.
– కందుకూరి సువర్ణ ,లబ్ధిదారురాలు (నంది మేడారం)
తండ్రిలెక్క ఆదుకుంటున్నడు
నాకు కొడుకు, కూతురు. వాళ్లు చిన్నోళ్లు. గుడిసెలో ఉంటున్నం. సొంతిల్లు లేదు. గుంట జాగ లేదు. నా భర్త శంకర్ 2017లో చనిపోయిండు. అప్పటి నుంచి నేను కూలీ నాలి చేసుకుంట పిల్లలను పోషించుకుంటున్న. కూలీ చేయనిదే ఇల్లు గడవదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పింఛన్ మంజూరు చేసి తండ్రి లెక్క ఆదుకుంటున్నడు. సార్‌కు రుణపడి ఉంట.
– చెనెల్లి లక్ష్మి,లబ్ధిదారురాలు (నంది మేడారం)
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
నాకు వయసు మీద పడ్డది. ఆరోగ్యం బాగలేక పని చాతనైతలేదు. మూడేండ్ల కిందనే నేను చేసే సుతారి పని బంద్వెట్టిన. నా భార్య పనిచేస్తేనే బుక్కెడు మెతుకులు దొరుకుతున్నై. అయినా పని రోజుండదాయె. ఇల్లు గడుసుడే కష్టమైతంది. మొన్నటిదాకా పింఛన్ రావాల్నంటే 65 ఏండ్లు కావాల్నయె. ఎట్లా అని అనుకున్న. కానీ, కేసీఆర్ సారు దయదలిచి 57 ఏండ్లోళ్లకు పింఛన్ ఇత్తనని చెబితే మస్తు సంబురపడ్డ. సార్లను పోయి కలిసి దరఖాస్తు జేసుకున్న. నాకు ఇయ్యాలనే మంత్రి గంగుల కమలాకర్ సారు కార్డు ఇచ్చిండు. అచ్చే నెల నుంచి నాకు రూ.2,016 వస్తయట. సంబురమైతుంది. ఇంటి ఖర్సులు ఎల్లుతయి. మాకు బతుకునిస్తున్న సీఎం కేసీఆర్ సారు రుణపడి ఉంటం.
– తుమ్మ భీరయ్య, లబ్ధిదారుడు (గోపాల్పూర్)