సుల్తానాబాద్, జనవరి 23: ముస్లిం ఆడబిడ్డల పెండ్లి ఖర్చులు తగ్గించేందుకు ముస్లిం కమిటీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పెండ్లి దావత్లో బగారతో పాటు ఒక కూర..స్వీటు మాత్రమే పెట్టాలని నిర్ణయించాయి. ఈనెల 16న వేములవాడ ముస్లిం కమిటీ, తాజాగా ఆదివారం సుల్తాన్‌బాద్ ముస్లిం కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. సుల్తానాబాద్‌లోని పాత జెండా వద్ద మసీదుల కమిటీల బాధ్యులు, మత పెద్దలు సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని నిర్దేశించారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ బాధ్యులు మాట్లాడు తూ నిరుపేద కుటుంబాలకు ఆడబిడ్డల పెండ్లి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. వచ్చే నెల నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఉన్నవారు ఆడంబరాలకు పోయి పెండ్లి వేడుకలకు పెద్దమొత్తంలో నగదు ఖర్చు చేస్తున్నారని. అయితే లేనివారు ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసేందుకు వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. ఖర్చులకు భయపడి పలువురు పెండ్లిఈడు వచ్చిన ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేయకపోవడంతో వారు ఇండ్ల వద్దే అత్యంత దయనీయ పరిస్థితిల్లో బతుకులు వెళ్లదీస్తున్నారని చెప్పారు. ముక్తకంఠంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. కాగా, వీరి ముస్లిం కమిటీల నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సమావేశంలో ముస్లీం మతపెద్దలతో పాటు కౌన్సిలర్ నిషాద్ఫ్రీక్, అధ్యక్షుడు సయ్యద్ సాజిద్, మిర్జాయూసుఫ్ అలీబేగ్, కోఅప్షన్ సభ్యుడు డాక్టర్ కలీం, ఈద్గా అధ్యక్షుడు డాక్టర్ తాహెర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సర్వర్ తదితరులున్నారు.