ధర్మారం. ఆగస్టు 27: ఏటా పది వేల కోట్లు ఖర్చు చేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్న ప్రభుత్వం కావాలా..? విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటున్న ప్రభుత్వం కావాలా..? మీరే ఆలోచించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా పేదల సంక్షేమాన్ని మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు అసలే నమ్మద్దని, పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాతలకు మేలు చేస్తున్న ధరణిని రద్దు చేస్తామని అంటున్న కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో పాతరేయాలని పిలుపునిచ్చారు. ధర్మారం మండలం నంది మేడారంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. 196 మందికి పింఛన్ పత్రాలు, కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అందిస్తున్న ఆసరా పింఛన్లు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు పాతవి 40 లక్షలు ఉండగా, కొత్తగా 10 లక్షల పింఛన్లు మంజూరుతో అవి 50 లక్షల వరకు చేరుకున్నాయని వివరించారు.
లబ్ధిదారులందరికీ ఐడీ కార్డులు ఇస్తున్నామని, ఇక సులభంగా డబ్బులు తీసుకోవచ్చని ఆయన వివరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని, కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదని, మీటర్ల బిగింపును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ నాయకులు అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాల్లో ఉన్న ప్రభుత్వాలను కేంద్రం ఈడీ, సీబీఐతో దాడులు చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదని, వాటిని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. సమావేశానికి సర్పంచ్ సామంతుల జానకి అధ్యక్షత వహించగా, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీడీవో జయశీల, తదితరులు పాల్గొన్నారు.