కోర్టుచౌరస్తా, ఆగస్టు 27: జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసులు ఎకువగా ఉన్నాయని, పరిష్కారానికి పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, న్యాయమూర్తులు చొరవ చూపాలని జిల్లా జడ్జి బీ ప్రతిమ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల మధ్యవర్తిత్వ భవనంలో శనివారం జిల్లా జడ్జి అధ్యక్షతన జరిగిన కో-ఆర్డినేషన్ సమావేశంలో జిల్లాలోని పెండింగ్ కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో జడ్జి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, 2018కి ముందు నమోదై ఉన్న 4765 క్రిమినల్ కేసులు జిల్లాలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిషారానికి పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పరిషారమయ్యేలా చూడాలని సూచించారు. వీటితో పాటు 30 ఏళ్ల కిందటి చిన్నచిన్న క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కొన్నింటిలో వారెంటు జారీ అయి యథా స్థితిలో ఉన్నాయని అలాంటి కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అభిప్రాయంతో కేసులు క్లోజ్ చేసుకునేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, ల్యాండ్ అక్విజేషన్ కేసులకు సంబంధించి కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు పరిషారానికి సూచనలు చేశారు.
పెండింగ్‌లో ఉన్న సీఐడీ నమోదు చేసిన కేసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ నమోదు చేసిన కేసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన కేసులపై ఆయా అధికారులతో జిల్లా జడ్జి చర్చించి వాటి పరిషారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో ఏమాత్రం అలసత్వం వద్దని వాటి పరిషారానికి మార్గాలను అన్వేషించి చట్టపరంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా సివిల్, క్రిమినల్, ఇతర పెండింగ్ కేసుల జాబితాను ఆయా శాఖల అధికారులకు అందించారు. జిల్లాలోని గర్భిణులు సాధారణ ప్రసవం వైపు మొగ్గు చూపేలా వారిలో అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వలంటీర్లకు శిక్షణ ఇవ్వన్నట్లు జిల్లా జడ్జి ఈ సందర్భంగా తెలిపారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లీడర్, ఎక్సైజ్, సీఐడీ, రెవెన్యూ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, జైలు అధికారులు, ల్యాండ్ అక్విజేషన్ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.