కార్పొరేషన్, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి కొత్త ఆసరా పింఛన్లు ఇస్తామని ప్రకటించగా, జిల్లాలో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ బల్దియా పరిధిలో ఇప్పటికే 21,454 మంది ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారు. కొత్తగా 5,678 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సప్తగిరికాలనీలో 5 డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా పింఛన్ మంజూరు పత్రాలు అందించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కొత్తగా 5 వేలకుపైగా పింఛన్లు
ఉమ్మడి రాష్ట్రంలో నగరపాలక సంస్థలో అంతంత మాత్రంగానే పింఛన్లు అందగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం నగరపాలక సంస్థలో 21,454 మందికి పింఛన్లు అందిస్తున్నారు. కాగా, గతంలో తెలంగాణ ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తామని పేర్కొనడంతో నగరపాలక పరిధిలో ఈ పథకం కింద 4 వేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. వీటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరితో పాటు గతంలో వివిధ కారణాలతో పింఛన్ నిలిచిపోయిన వారు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అర్హుల జాబితాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కాగా, 5,678 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, 60 డివిజన్ల వారీగా విభజించి కార్పొరేటర్లకు జాబితాలను అందించారు.
ఈ మేరకు సెప్టెంబర్ నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ చేయనున్నారు. సప్తగిరికాలనీ పరిధిలోని 5 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ఆదివారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా పింఛన్ మంజూరు పత్రాలు అందించనున్నారు. అనంతరం ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. కాగా, నగరంలో దివ్యాంగులు 1086, బీడీ కార్మికులు 127, ఒంటరి మహిళలు 116, వృద్ధాప్య పింఛన్లు 773, 57 ఏళ్లకు పైబడి వారిలో 2690, గీత కార్మికులు 16, వితంతువులు 776, ఇతర పింఛన్లు 184 మందికి మంజూరయ్యాయి.